వచ్చే ఏడాది ఐపీఎల్ యూఏఈలోనే.. బీసీసీఐ కీలక ఒప్పందం

  • Published By: vamsi ,Published On : September 20, 2020 / 10:18 AM IST
వచ్చే ఏడాది ఐపీఎల్ యూఏఈలోనే.. బీసీసీఐ కీలక ఒప్పందం

ipl-2021

కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా భారతదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఇప్పట్లో ఆడే పరిస్థితి లేదు. కోవిడ్-19 కారణంగా భారతదేశంలో ఉన్న పరిస్థితి దారుణం, వచ్చే ఏడాది జనవరిలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ కూడా యూఏఈలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, వచ్చే ఏడాది యూఏఈలో ఐపిఎల్ నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఐపీఎల్‌ 2021 సమయానికి భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోతే.. వరుసగా రెండో ఏడాది కూడా అక్కడే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు బలోపేతం కానున్నట్లు రెండు బోర్టులు చెబుతున్నాయి.

అయితే ఈ ఏడాది ఐపీఎల్ వరకు మాత్రమే అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ చెప్పారు. కానీ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ 2021 మరియు వచ్చే ఏడాది ఐపిఎల్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే అవకాశం ఉంది. యూఏఈ క్రికెట్ బోర్డుతో శనివారం జరిగిన సమావేశంలో బిసిసిఐ చైర్మన్, కార్యదర్శి, కోశాధికారి పాల్గొన్నారు.



భారతదేశంలో ప్రతిరోజూ లక్ష కరోనా వైరస్ కేసులు నమోదవుతుండగా.. కరోనా కేసుల పెరుగుదల వేగం చూస్తుంటే, ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశం కరోనా రహిత దేశంగా మారే అవకాశం కనిపించట్లేదు. ఈక్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 మ్యాచ్‌లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో బీసీసీఐ నిర్వహిస్తోంది. భారత్‌లో కరోనా ఉధృతి తగ్గకపోతే.. టీమిండియా సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్‌లకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అవుతుంది. ఈ మేరకు ఆ దేశ బోర్డుతో కీలక ఒప్పొందం కుదిరింది.

ప్రతి ఏటా షెడ్యూల్‌లాగే ఏప్రిల్‌-మేలోనే ఐపీఎల్‌ జరగాల్సి వస్తే యూఏఈనే సరైన వేదికగా భావిస్తున్నారు అధికారులు. 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ తర్వాత భారత జట్టు యూఏఈలో ఆడేందుకు నిరాకరిస్తూ వచ్చింది. 2006లో మాత్రం పాక్‌తో 2 వన్డేల సిరీస్‌ ఆడింది. ఇక 2014లో కొన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు అక్కడ జరిగాయి.