వాంఖడేలో ముగ్గురికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ మ్యాచ్‌లపై ప్రభావం

వాంఖడేలో ముగ్గురికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ మ్యాచ్‌లపై ప్రభావం

Wankhede

క్రికెట్ అభిమానులు ఎదరుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌లు మరో మూడు రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉండగా.. ఇటువంటి సమయంలో కరోనా ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడబోతున్నట్లుగా అర్థం అవుతోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం సిబ్బంది వరుసగా కరోనా బారిన పడడం ఇప్పుడు ఐపీఎల్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది.

2021సీజన్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుండగా.. ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య వాంఖడే వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా.. స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్న ముగ్గురు సిబ్బందికి లేటెస్ట్‌గా కరోనా రావడం నిర్వాహకులను కలవరపెడుతోంది.

వాంఖడే స్టేడియంలో 19 మంది గ్రౌండ్స్‌మెన్స్‌కిగానూ రెండు రోజుల క్రితం పది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పడు మరో ఇద్దరు గ్రౌండ్స్‌మెన్‌‌కి మహమ్మారి సోకగా.. ఒక ప్లంబర్‌కి కూడా కోవిడ్-19 వచ్చినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. పది మ్యాచ్‌లు వాంఖడే స్టేడియంలోనే జరగనున్నాయి.

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఐపీఎల్ జట్లకి మాత్రం ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో ఆ స్టేడియంలో మ్యాచ్‌ల విషయంలో సందిగ్ధత నెలకొంది.