IPL 2022 Retention: ఐపీఎల్‌ రిటెన్షన్‌.. పూర్తి వివరాలు ఇవే.. ధోనీ, కోహ్లీలకు తగ్గిన జీతాలు

ఐపీఎల్ మెగా వేలానికి ముందు, లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను రిటైన్ చేసకున్నట్లుగా ప్రకటించాయి.

10TV Telugu News

IPL 2022 Retention: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు, లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను రిటైన్ చేసకున్నట్లుగా ప్రకటించాయి. అఫీషియల్‌గా రిటైన్డ్ ప్లేయర్ల లిస్ట్‌ను కూడా విడుదల చేశాయి జట్లు. క్రీడా పండితులు చేస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడగా.. నిలుపుదల ప్రక్రియ తర్వాత, 27 పేర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఐపీఎల్‌లో చాలామంది స్టార్ ప్లేయర్లు రిటైనింగ్‌లో చోటు కోల్పోయారు. అదే సమయంలో చాలా మంది యువ ఆటగాళ్లకు అదృష్టం కలిసొచ్చింది.

అత్యధిక వ్యయంతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తమ స్టార్ ఆల్ రౌండర్‌ను అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తమ యువ కెప్టెన్‌ను రూ. 16కోట్లకు అట్టిపెట్టుకున్నాయి. కాగా విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల జీతం గతంతో పోలిస్తే చాలావరకు తగ్గింది.

1. విరాట్ కోహ్లీ మరియు MS ధోనీల జీతాల్లో కోత!
ఈ ఐపీఎల్‌ రిటెన్షన్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీల వేతనాలు తగ్గించడం. గత సంవత్సరాల్లో కంటే తక్కువ ఖర్చుతో ఈ సూపర్ స్టార్లను జట్టులోకి తీసుకున్నాయి ప్రాంచైజ్‌లు. విరాట్ కోహ్లీని RCB 15 కోట్లకు రిటైన్ చేయగా, MS ధోనిని CSK కేవలం 12కోట్ల రూపాయలకు జట్టులో చేర్చుకుంది.

2. MS ధోని స్థానంలో జడేజా..
మొదటి సీజన్ నుంచి CSK కెప్టెన్‌గా ఉన్న MS ధోనీని CSK నంబర్ టూ స్థానంలో ఉంచుకుంది. నంబర్ వన్‌లో ధోనీకి సన్నిహితుడిగా భావించే రవీంద్ర జడేజాను కొనసాగించింది. టీమ్‌కి నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన కెప్టెన్ ధోనీ, తన రిటైర్మెంట్ దృష్ట్యా, స్వయంగా ముందుకు వచ్చి తక్కువ జీతం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో జడేజా పేరు నంబర్ వన్‌గా నిలిచింది. అలాగే గత సీజన్‌లో RCB కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విరాట్ కోహ్లీ జీతం కూడా తగ్గింది.

3. యువ ఆటగాళ్ళు:
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో ఎక్కువ మంది యువ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. ఈసారి ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను విశ్వసించకుండా యువ ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఈ స్టార్ ప్లేయర్లలో డేవిడ్ వార్నర్, యుజ్వేంద్ర చాహల్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. రిటైన్ చేయబడిన ఆటగాళ్లలో సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ సిరాజ్ వంటివారు ఉన్నారు.

4. స్టార్ ప్లేయర్లు:
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రషీద్ ఖాన్‌లు వారి జట్లను విడిచిపెట్టారు. IPL 2022 వేలం సమయంలో, ఈ ఆటగాళ్లపై పెద్ద బిడ్డింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

5. అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ లక్కీగా..
స్టార్ ప్లేయర్‌లతో పాటు, ఫ్రాంచైజీలు కూడా కొంతమంది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై విశ్వాసం ఉంచాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ క్రికెటర్లకు జట్టులో స్థానం కల్పించారు. యశస్వి జైస్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో కొనసాగిస్తోంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు 4 కోట్ల ధర నిర్ణయించారు. అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లను కూడా ఆయా జట్లు అట్టిపెట్టుకున్నాయి.

అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్:
యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్) – 19 సంవత్సరాలు
అబ్దుల్ సమద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 20 సంవత్సరాలు
ఉమ్రాన్ మాలిక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 22 సంవత్సరాలు
అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) – 22 సంవత్సరాలు

జట్లు రిటైన్ చేసుకుంది వీరినే:
చెన్నై: జడేజా (రూ.16 కోట్లు), ధోని (రూ.12 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్(రూ.6 కోట్లు)

ముంబై ఇండియన్స్: రోహిత్‌ (రూ.16 కోట్లు), బుమ్రా (రూ.12 కోట్లు), సూర్యకుమార్‌ (రూ.8 కోట్లు), పొలార్డ్‌ (రూ.6 కోట్లు)

ఢిల్లీ క్యాపిటల్స్: పంత్‌(రూ.16 కోట్లు), అక్షర్‌ పటేల్‌ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), నార్ట్జ్(రూ.6.5కోట్లు)

కోల్‌కతా: రసెల్‌ (రూ.12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ.8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.8 కోట్లు), నరైన్‌ (రూ.6 కోట్లు)

బెంగళూరు: కోహ్లీ(రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), సిరాజ్(రూ.7 కోట్లు)

సన్‌రైజర్స్‌: విలియమ్సన్(రూ.14 కోట్లు), అబ్దుల్‌ సమద్(రూ.4 కోట్లు), ఉమ్రాన్‌ మాలిక్(రూ.4 కోట్లు)

రాజస్థాన్‌: సంజు శాంసన్‌ (రూ.14 కోట్లు), బట్లర్‌ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్(రూ.4 కోట్లు)

పంజాబ్‌: మయాంక్(రూ.12 కోట్లు), అర్ష్‌దీప్(రూ.4కోట్లు)

×