ఐపీఎల్ 2021 వేలం ప్రక్రియ వాయిదా!

ఐపీఎల్ 2021 వేలం ప్రక్రియ వాయిదా!

IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఐపీఎల్ ఆటగాళ్ల రెటెన్షన్ గడువు ఇప్పటికే ముగిసింది. గత నాలుగు రోజులుగా తమకు అవసరం లేని ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీ యాజమాన్యాలు విడుదల చేస్తున్నాయి.

ఈసారి వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ. 196 కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అయ్యాయి. కాగా సొంతగడ్డపై వచ్చే నెల నుంచి ఇంగ్లండ్‌తో భారత్‌ సిరీస్‌ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్‌ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది. కరోనా కారణంగా గత సీజన్‌ ను దుబాయ్‌లో నిర్వహించారు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో ఐపీఎల్‌ జరిగింది. ఈసారి ఐపీఎల్‌కి స్టేడియం సామర్థ్యంలో సగం సీట్లలలో ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. అయితే దాదాపు రెండు నెలలకు పైగా జరిగే ఈ మెగా లీగ్‌ని ఇరవైకి పైగా నగరాల్లో నిర్వహిస్తారు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనందున ఈసారి లీగ్‌ని ఇండియాలో నిర్వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు.