IPL FINAL: చెన్నై టార్గెట్ 150

IPL FINAL: చెన్నై టార్గెట్ 150

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ ముగించారు. నిర్ణీత ఓవర్లకు 8వికెట్లు నష్టపోయి అతికష్టంపై చెన్నైకు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. దీపక్ చాహర్ 3వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్‌కు చెరో 2వికెట్లు దక్కాయి. 

ఆరంభంలో కనిపించిన దూకుడు చివరివరకూ కొనసాగించలేకపోయింది ముంబై ఇండియన్స్. స్పిన్నర్ల ధాటికి వికెట్లు కాపాడుకునేందుకు కష్టపడింది. డికాక్(29; 17బంతుల్లో 4 సిక్సులు)స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. దూకుడు మీదున్న ముంబై ఓపెనర్ డికాక్‌ను 4.5వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత 3బంతుల విరామానికే రోహిత్(15)వికెట్‌ను చాహర్ పడగొట్టాడు. దాంతో ముంబై స్కోరు నత్తనడకన సాగింది. 

సూర్యకుమార్ యాదవ్(15), ఇషాన్ కిషన్(23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కృనాల్ పాండ్యా(7)వచ్చిన కాసేపటికే ఠాకూర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బర్త్ డే బాయ్ కీరన్ పొలార్డ్(41; 25బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు) మ్యాచ్ పూర్తయ్యేవరకూ క్రీజులో నిలబడి ముంబైకు స్కోరు తెచ్చిపెట్టాడు. మరో ఎండ్‌లో దిగిన బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యా(16; 10 బంతుల్లో) బాదుడు మొదలుపెట్టగానే చాహర్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ చాహర్(0), మిచెల్ మెక్ క్లెనగన్(0), బుమ్రా(0)లతో సరిపెట్టుకున్నారు.