GT vs MI: ధోనితో త‌ల‌ప‌డేది ఎవ‌రో..? రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న గుజ‌రాత్‌..? రోహిత్ సేన‌కు క‌ష్ట‌మేనా..?

ఇప్పుడు అంద‌రి క‌ళ్లు అహ్మ‌దాబాద్ వేదికగా శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్ 2 పైనే ఉన్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల‌లో ఏ జ‌ట్టు విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

GT vs MI: ధోనితో త‌ల‌ప‌డేది ఎవ‌రో..? రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న గుజ‌రాత్‌..? రోహిత్ సేన‌కు క‌ష్ట‌మేనా..?

Qualifier 2 GT vs MI

IPL 2023: ఇప్పుడు అంద‌రి క‌ళ్లు అహ్మ‌దాబాద్ వేదికగా శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్ 2 పైనే ఉన్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans), ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) జ‌ట్ల‌లో ఏ జ‌ట్టు విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)తో త‌ల‌ప‌డ‌నుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎలిమినేట‌ర్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) పై భారీ విజ‌యం సాధించ‌డంతో రెట్టించిన ఉత్సాహంలో ఉంది ముంబై.

అయితే.. తొలి క్వాలిఫ‌య‌ర్‌లో చెన్నై చేతిలో ఓడిన గుజ‌రాత్ ఫైన‌ల్ చేరుకునేందుకు ఉన్న ఈ ఆఖ‌రి అవ‌కాశాన్ని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌ద‌ల‌కూడ‌దు అన్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరీ హోరీ జరిగే అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రి ముంబై ఏడోసారి ఫైన‌ల్‌కు చేరుకుంటుందా..? లేదంటే హార్ధిక్ జ‌ట్టు వ‌రుస‌గా రెండో ఏడాది ఆఖ‌రి స‌మ‌రానికి సై అంటుందా..? అన్న‌ది చూడాల్సిందే.

సొంత‌గ‌డ్డ‌పై స‌త్తా చాటేనా..?

సొంత‌గ‌డ్డ‌పై మ్యాచ్ ఆడుతుండ‌డం ఇక్క‌డ గుజ‌రాత్ టైటాన్స్‌కు క‌లిసి వ‌చ్చే అంశం. లీగ్ ద‌శ‌లో టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన గుజ‌రాత్ తొలి క్వాలిఫ‌య‌ర్‌లో త‌డ‌బ‌డింది. బ్యాటింగ్‌లో ఆ జ‌ట్టు ఎక్కువ‌గా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ పైనే అతిగా ఆధార‌ప‌డిన‌ట్లుగా కనిపిస్తోంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే రెండు శ‌త‌కాలు బాదిన గిల్ 15 మ్యాచుల్లో 722 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో డుప్లెసిస్‌(730) అగ్ర‌స్థానంలో ఉండ‌గా రెండో స్థానంలో గిల్ ఉన్నాడు.

గిల్ నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌గా మిగిలిన వారు ఆడ‌పాద‌డ‌పా మాత్ర‌మే ఆడుతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు డేవిడ్ మిల్ల‌ర్‌, విజ‌య్ శంక‌ర్‌, రాహుల్ తెవాటియాలు త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లుగా రాణిస్తే బ్యాటింగ్‌లో భారీ స్కోరు ఈజీగా చేయొచ్చు. బౌలింగ్‌లో ష‌మీతో పాటు ర‌షీద్ ఖాన్‌, నూర్ అహ్మ‌ద్‌లు నిల‌క‌డ‌గా రాణిస్తున్నారు. 15 మ్యాచుల్లో ష‌మీ 26, ర‌షీద్ 25 వికెట్లు తీసి అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో మొద‌టి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. మ‌రోసారి వీరు రాణిస్తే ముంబై బ్యాట‌ర్లకు క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇక ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ధ‌సున్ శ‌న‌క స్థానంలో పేస‌ర్ జాఘువా లిటిల్‌, ద‌ర్శ‌న్ న‌ల్కండే స్థానంలో సాయి సుద‌ర్శ‌న్ ను తుది జ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.

జోరు కొన‌సాగించేనా..?

గ‌త కొన్ని సీజ‌న్లుగా చూసుకుంటే ఆరంభంలో చ‌తికిల ప‌డ‌డం ఆ త‌రువాత విజృంభించి టైటిన్‌ను సొంతం చేసుకోవ‌డం ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు అల‌వాటుగా మారింది. ఈ సారి కూడా అదే విధంగా ఆడుతోంది. ఎలిమినేట‌ర్‌లో 81 ప‌రుగుల‌తో ల‌క్నోను ఓడించ‌డం ఆ జ‌ట్టు ఆత్మ‌విశ్వాసాన్ని మ‌రింత పెంచేదే. ఇషాన్ కిష‌న్, కామెరూన్ గ్రీన్, సూర్య‌కుమార్ యాద‌వ్‌, టిమ్ డేవిడ్‌, నేహాల్ వ‌ధెరా, తిల‌క్ వ‌ర్మ‌లు ఫామ్‌లో ఉండ‌డం ముంబైకి క‌లిసి వ‌చ్చే అంశం. ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా బ్యాట్ ఝుళిపిస్తే బ్యాటింగ్‌లో ముంబైకి తిరుగులేదు.

బుమ్రా, ఆర్చ‌ర్ వంటి కీల‌క బౌల‌ర్ల గైర్హ‌జ‌రీలోనూ ముంబై బౌల‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. ముఖ్యంగా ఆకాశ్ మ‌ద్వాల్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబై విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. స‌న్‌రైజ‌ర్స్ పై నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి జ‌ట్టును ప్లే ఆఫ్స్ చేర‌డంలో కీల‌క పాత్ర పోషించిన మ‌ద్వాల్ .. ల‌క్నోపై శివాలెత్తాడు. 3.3 ఓవ‌ర్లు వేసి 5 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టి జ‌ట్టుకు ఘ‌న విజ‌యాన్ని అందించాడు. ఇత‌డితో పాటు జోర్డాన్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, పీయూష్ చావ్లాలు స‌త్తా చాటితే గుజ‌రాత్‌కు తిప్ప‌లు త‌ప్ప‌వు.

ముఖాముఖి

ఐపీఎల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు మూడు సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. రెండు మ్యాచుల్లో గుజ‌రాత్, ఓ మ్యాచ్‌లో ముంబై గెలుపొందింది.

పిచ్

అహ్మ‌దాబాద్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోరు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా పేస్‌, బౌన్స్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

తుది జట్లు (అంచనా)

ముంబై ఇండియన్స్ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్(వికెట్ కీప‌ర్‌), సూర్య‌కుమార్ యాద‌వ్, కామెరూన్‌ గ్రీన్, లక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్, నేహల్‌ వధేరా, జోర్డాన్, హృతిక్‌ షోకిన్, పీయూశ్‌ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్, ఆకాశ్‌ మధ్వాల్‌.

గుజరాత్‌ టైటాన్స్‌: శుభ్‌మ‌న్ గిల్‌, సాహా(వికెట్ కీప‌ర్‌), సూర్య‌కుమార్ యాద‌వ్, సాయిసుద‌ర్శ‌న్‌, డేవిడ్ మిల్ల‌ర్, విజయ్‌ శంకర్‌/మోహిత్‌ శర్మ, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్, జాషువా లిటిల్‌, నూర్‌ అహ్మద్, మ‌హ్మ‌ద్‌ షమీ.