Wasim Akram: ప్రపంచ క్రికెట్లో సూపర్ స్టార్ అవుతాడు.. సచిన్‌తో పోల్చుతూ శుభ్‌మన్ గిల్ గురించి వసీం ఇంకా ఏం చెప్పారంటే?
" అందుకే గిల్ వంటి బ్యాటర్ కు బౌలింగ్ చేయడమంటే సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేస్తున్నట్లే" అని వసీం అక్రం అన్నారు.

Wasim Akram
Wasim Akram – Shubman Gill: టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తో పోల్చుతూ పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత క్రికెట్ లో ఓ స్టార్ గానే కాకుంగా ప్రపంచ క్రికెట్లో సూపర్ స్టార్ గా శుభ్‌మన్ వెలుగొందుతాడని చెప్పారు.
ఐపీఎల్-2023(IPL 2023)లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన శుభ్‌మన్ గిల్ ఈ టోర్నీలో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఆస్ట్రేలియా-భారత్ తలపడనున్న నేపథ్యంలో అక్రం శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడారు. సచిన్ – శుభ్‌మన్ గిల్ మధ్య బ్యాటింగ్ లో కొన్ని సారూప్యతలు ఉన్నాయని చెప్పారు.
” గిల్ వంటి బ్యాటర్ కు బౌలింగ్ చేయడమంటే సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేస్తున్నట్లే. టీ20 ఫార్మాట్లోనయినా అంతే.. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ కు మొదటి 10 ఓవర్లు బౌలింగ్ చేయడం ఎలాగో గిల్ కు బౌలింగ్ చేయడం కూడా అలాగే.
మైదానంలో ఆ సమయంలో 30 యార్డుల సర్కిల్ లో కేవలం ఇద్దరు ఫీల్డర్లు ఉండేందుకే అనుమతి ఇస్తారు. జయసూర్య, కలువితరాణ వంటి వారికి బౌలింగ్ చేస్తున్నప్పుడు వారికి ఔట్ చేసే అవకాశం ఉంటుంది. వారు ప్రతి బంతిని వారిదైన శైలిలో ఆడతారు.
అయితే, సచిన్, గిల్ లాంటి వారు సమర్థంగా క్రికెటింగ్ షాట్లు ఆడతారు. మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడే ఆటగాడు గిల్ అని నేను భావిస్తున్నాను. అతడు భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్లో సూపర్ స్టార్ అవుతాడు” అని అక్రం చెప్పారు. గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అవుతారని, టీమిండియాకూ భవిష్యత్తులో అతడే కెప్టెన్ అని తెలిపారు.