ఇంగ్లాండ్ vs వెస్టిండీస్: 32ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌కు అవకాశం.. ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరికి విశ్రాంతి

  • Published By: vamsi ,Published On : July 16, 2020 / 07:15 AM IST
ఇంగ్లాండ్ vs వెస్టిండీస్: 32ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌కు అవకాశం.. ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరికి విశ్రాంతి

ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగనుంది. సౌతాంప్టన్‌లో ఆడిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించి వెస్టిండీస్ జట్టు ముందంజలో ఉంది. ఇప్పుడు 32ఏళ్లలో మొదటిసారిగా ఇంగ్లాండ్.. విండీస్‌తో సిరీస్‌ను కోల్పోయే పరిస్థితిలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ తిరిగి వస్తున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ జట్టుకు నాయకత్వం వహించాడు.

మాంచెస్టర్‌లో ఆడిన రెండో మ్యాచ్ ఇంగ్లండ్‌కు సిరీస్‌ను కాపాడే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ మొదటి మ్యాచ్‌కు పర్సనల్ కారణంతో సెలవు తీసుకున్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. మ్యాచ్‌కు ముందే, గెలుపు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కెప్టెన్ స్పష్టం చేశాడు.

ఇక 32ఏళ్ల తరువాత, వెస్టిండీస్‌కు ఇంగ్లాండ్‌లో జరిగే టెస్ట్ సిరీస్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. వెస్టిండీస్ 1988 లో ఇంగ్లాండ్‌లో తమ చివరి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 4–0తో గెలుచుకుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య 158 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో వెస్టిండీస్ 58, ఇంగ్లాండ్ 49 గెలవగా, 51మ్యాచ్‌లు డ్రాగా నిలిచాయి. 87 టెస్ట్ మ్యాచ్‌లు ఇంగ్లాండ్, వెస్టిండీస్.. ఇంగ్లాండ్‌లో ఆడాయి. వీటిలో ఇంగ్లండ్ 34 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 31 సార్లు గెలిచింది. 22 టెస్ట్ డ్రాలు ఉన్నాయి.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య 15 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఇంగ్లాండ్ ఆరు, వెస్టిండీస్ ఐదు, నాలుగు డ్రాగా నిలిచాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆడిన మునుపటి 10 టెస్ట్ మ్యాచ్‌లలో, ఇంగ్లాండ్ ఏడు విజయాలు సాధించగా, ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. రెండు టెస్ట్ మ్యాచ్‌లు డ్రా గా ముగిశాయి.

ఇక జట్టు విషయానికి వస్తే.. సీనియర్ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ సహా మరో బౌలర్ మార్క్ వుడ్​కు ఇంగ్లండ్ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. తొలి టెస్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వచ్చాడు. అలాగే రెండో సంతానం కలుగడంతో ఫస్ట్ మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ జో రూట్​.. ఈ మ్యాచ్​లో జట్టును ముందుకు నడిపించనున్నాడు. అలాగే జో డెన్లీ దూరమయ్యాడు.