అంపైర్‌పై అసహనం.. బ్యాట్‌ను ఎగరేసిన పొలార్డ్

అంపైర్‌పై అసహనం.. బ్యాట్‌ను ఎగరేసిన పొలార్డ్

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నైపై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఖాతాలో నాల్గో ఐపీఎల్ టైటిల్ వచ్చి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ భారీ టార్గెట్ ఇస్తుందనుకున్న తరుణంలో కేవలం 149పరుగులకే పరిమితమైంది. 

టాపార్డర్ కుప్పకూలిన వేళ పొలార్డ్ ఒక్కడే క్రీజులో పాతుకుపోయాడు. వీలు కుదిరినప్పుడల్లా షాట్లు బాదుతూ జట్టుకు పరవాలేదనిపించే స్కోరు నమోదు చేశాడు. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో కట్టడి చేసేందుకు ధోనీ.. బ్రావోకు బౌలింగ్ అప్పగించాడు. 19.1 బాల్‌ను అటెంప్ట్ చేశాడు పొలార్డ్. వైడ్‌గా విసిరిన బంతిని ప్రకటించలేదు. తర్వాతి బంతిని అదే విధంగా వేయడంతో అటెంప్ట్ చేయకుండా వదిలేశాడు. అయినా దానిని వైడ్‌గా ప్రకటించలేదు. 

అసహనానికి గురైన పొలార్డ్ గాల్లోకి బ్యాట్‌ను ఎగరేశాడు. ఆ తర్వాత మూడో బంతికి  పొలార్డ్ పూర్తిగా క్రీజుకు కుడివైపుగా వచ్చి ఒక్కసారిగా తప్పుకున్నాడు. దాంతో అంపైర్లు పొలార్డ్ వద్దకు వచ్చి వివరణ అడిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత బంతికే మరో ఎండ్‌లో ఉన్న మెక్ క్లెనగన్ అవుట్ అవడంతో మిగిలిన 2బంతులను బౌండరీకి పంపించాడు పొలార్డ్. 

మ్యాచ్ మధ్యలో బ్యాట్ ఎగరేయడం నియమావళిని ఉల్లంఘించడంతో సమానంగా భావించిన అంపైర్లు పొలార్డ్ మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించారు.