IPL 2023, KKR vs RR: గాడి త‌ప్పిన రాజ‌స్థాన్‌.. కేకేఆర్‌ను ఓడిస్తేనే సంజుసేన‌కు ప్లే ఆఫ్ ఛాన్స్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023 సీజ‌న్‌ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. సీజ‌న్ ఆరంభంలో బాగా ఆడిన జ‌ట్లు మ‌లి ద‌శ‌లో వెనుక‌బ‌డ‌గా మొద‌ట్లో ఆడ‌ని జ‌ట్లు పుంజుకోవ‌డంతో ప్లే ఆఫ్స్ రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IPL 2023, KKR vs RR: గాడి త‌ప్పిన రాజ‌స్థాన్‌.. కేకేఆర్‌ను ఓడిస్తేనే సంజుసేన‌కు ప్లే ఆఫ్ ఛాన్స్‌

KKR vs RR

IPL 2023, KKR vs RR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. సీజ‌న్ ఆరంభంలో బాగా ఆడిన జ‌ట్లు మ‌లి ద‌శ‌లో వెనుక‌బ‌డ‌గా మొద‌ట్లో ఆడ‌ని జ‌ట్లు పుంజుకోవ‌డంతో ప్లే ఆఫ్స్ రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals), కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు చెరో 11 మ్యాచులు ఆడ‌గా ఐదు మ్యాచుల్లో గెలిచాయి.

పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్థాన్ ఐదో స్థానంలో కేకేఆర్ ఆరో స్థానంలో కొన‌సాగుతున్నాయి. ఈ రెండు జ‌ట్లు మిగిలిన మూడు మ్యాచుల్లో విజ‌యం సాధిస్తే త‌ప్ప ప్లే ఆఫ్స్‌కు చేరే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ త‌రుణంలో నేటి మ్యాచ్ కీల‌కంగా మారింది. గెలిచిన జ‌ట్టు ప్లే ఆఫ్స్ వైపు అడుగులు వేయ‌నుండ‌గా ఓడిన జ‌ట్టు దాదాపుగా రేసు నుంచి నిష్క్ర‌మించిన‌ట్లే. దీంతో ఇరు జ‌ట్లు హోరా హోరీగా పోరాడ‌నున్నాయి.

గ‌త 6 మ్యాచుల్లో 5 ఓట‌ములు

అయితే.. ఈ సీజ‌న్‌లో ఆరంభంలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన రాజ‌స్థాన్ గ‌త 6 మ్యాచుల్లో ఐదింటిలో ఓడి క‌ష్టాల్లో ప‌డింది. చివ‌రి మూడు మ్యాచుల్లో హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు ఆ జ‌ట్టును ప‌ల‌క‌రించాయి. ఈ ఓట‌ముల ప‌రంప‌ర నుంచి ఈ జ‌ట్టు బ‌య‌ట‌ప‌డాలని భావిస్తోంది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోక‌పోవ‌డం, వ్యూహ్యాల్లో లోపాలు ఉన్నాయి. య‌శ‌స్వి జైస్వాల్, సంజు శాంస‌న్‌, హెట్‌మైయ‌ర్ ఫామ్‌లో ఉండ‌గా చివ‌రి మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్ జోరు అందుకోవ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. గ‌త మ్యాచ్‌కు దూరం ఉన్న బౌల్ట్ కోల్‌క‌తా మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.

సెకండాఫ్‌లో కేకేఆర్ జోరు

ఓట‌ముల‌తో సీజ‌న్‌ను మొద‌లు పెట్టిన కోల్‌క‌తా సెకండాఫ్‌లో వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తోంది. గ‌త నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది. వ‌రుస విజ‌యాలు కోల్‌క‌తా ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయ‌న‌డంలో సందేహం లేదు. జేస‌న్ రాయ్ రాక‌తో బ్యాటింగ్ విభాగం ప‌టిష్టంగా మారింది. నితీశ్ రాణా, వెంక‌టేశ్ అయ్య‌ర్‌, రింకూ సింగ్‌లు సంద‌ర్భానుసారంగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో ఉమేశ్‌, శార్దూల్‌, ర‌సెల్‌లు పేస్ బాధ్య‌త‌లు మోస్తుండ‌గా సుయాశ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌మ స్పిన్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు.

హెడ్ టూ హెడ్ రికార్డు..

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు 26 మ్యాచుల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 14 మ్యాచుల్లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 12 మ్యాచుల్లో విజ‌యం సాధించాయి.

పిచ్‌

కోల్‌క‌తా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోరు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్న‌ర్లు రాణించొచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

తుది జ‌ట్ల (అంచ‌నా)

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్