భారత్ స్కోరు 296 : ఒంటి చేత్తో రాహుల్ ఒడ్డున పడేశాడు

10TV Telugu News

మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు చేజార్చుకుంది టీమిండియా. పరువు నిలబెట్టుకోవాలంటే ఆఖరి మూడో వన్డేలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. కోహ్లీసేన గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ అవకాశమిచ్చింది. గెలవాలనే కసితో భారత ఓపెనర్ పృథ్వీ షా 40 పరుగులతో జట్టును కొంతమేర ఆదుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 62 పరుగులతో హాఫ్ సెంచరీ దాటేశాడు. మనీష్ పాండే 42 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువలో ఆగిపోయాడు. జట్టును ఆదుకుంటాడు అనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులకే పరిమితమయ్యాడు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోరుకే పరిమతయ్యారు. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.

ఇక జట్టులో మిగిలింది ఆ ఒక్కడే.. అతడే కేఎల్ రాహుల్.. ఆటంతా తన భుజాలపైనా వేసుకుని మందుకు నడిపించాడు. (113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు)లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్ 112 సెంచరీ చేసి ఒంటి చేత్తో టీమిండియాను ఒడ్డున పడేశాడు. కివీస్ బౌలర్లు విసిరే ప్రతి బంతిని అత్యధికంగా బౌండరీలు దాటిస్తూ పరుగుల వరద పారించాడు. ఫలితంగా టీమిండియా జోరుందుకుంది.

రాహుల్ విజృంభణతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 300 పరుగులకు సమీపంలోకి స్కోరును తీసుకెళ్లి ఔరా రాహుల్ అనిపించాడు. తద్వారా ఆసియా బయట 1999 తర్వాత తొలి వన్డే సెంచరీ నమోదు చేసిన భారత వికెట్ కీపర్ గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు. టౌంటన్ లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో రాహుల్ ద్రవిడ్ 145 పరుగులు సాధించాడు. తన వన్డే కెరీర్‌లో 4వ సెంచరీని రాహుల్ నమోదు చేశాడు.

ఇప్పటికే రెండు వన్డేలో విఫలమైన టీమిండియా వ్యూహాం.. ఆఖరి వన్డేలో పనిచేస్తుందా? లేదో భారత బౌలర్లపై ఆధారపడి ఉంది. ఛేజింగ్ లో కివీస్ ను భారత్ కట్టడి చేయగలిగితేనే కనీసం గెలుపు అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగేది.. సిరీస్ ఎట్టాగో చేజారింది.. గెలిచైనా పరువు నిలబెట్టుకోవాలని కోహ్లీసేన ఆరాటపడుతోంది.

మరోవైపు కివీస్ జట్టు.. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన ఉత్సాహంతో ఆఖరి వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది… చివరి వన్డేలోనైనా భారత్ గెలుస్తుందా? లేదా మరో ఓటమిని చవిచూస్తుందా? ఏ మేరకు కివీస్ ను టీమిండియా కట్టడి చేయగలదో చూడాలి.