అచ్చం కోహ్లీలాగే: సెంచరీ కొట్టి నేను కాదు బ్యాట్ మాట్లాడుతుందనే ఫీట్

అచ్చం కోహ్లీలాగే: సెంచరీ కొట్టి నేను కాదు బ్యాట్ మాట్లాడుతుందనే ఫీట్

మైదానంలో ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ దూకుడుగా కనిపిస్తాడు కోహ్లీ. ప్రత్యర్థి జట్టును ఓడించడానికి కసితీరా ప్రయత్నించే విరాట్ ఎలాంటి యుద్ధానికైనా వెనుకాడడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీపై వచ్చిన విమర్శలకి సమాధానంగా పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టు మూడో రోజులో సెంచరీ బాదాడు. అది కోహ్లీ కెరీర్‌లో 25వ సెంచరీ. 

ఆ సెంచరీ పూర్తయ్యాక బ్యాట్ ఎత్తి చేతి వేళ్లను ఊపుతూ.. నేను కాదు నా బ్యాట్ మాట్లాడుతుందని సైగలు చేశాడు. దాని అర్థం తెలియక కాసేపటి వరకూ కామెంటేటర్లు అయోమయానికి గురైయ్యారు. మళ్లీ అలాగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్.. స్టేడియంలోని అభిమానులకు కోహ్లీని గుర్తు చేశాడు.

ఆగష్టు 2018లో ఫేస్‌బుక్‌లో ఓ అభిమానిపై చేసిన కామెంట్‌కు బంగ్లాదేశ్ డిసిప్లేన్ కమిటీ ఐదు నెలల పాటు నిషేదించింది. ఇన్నాళ్ల తర్వాత బరిలోకి దిగిన రెహ్మాన్ 46వ ఓవర్లో చివరి పరుగు పూర్తిచేసుకుని సెంచరీ చేశాడు. ఆ వెంటనే కోహ్లీ గాల్లోకి ఎగిరి సెలబ్రేట్ చేసుకున్నట్లుగానే ఎగురుకుంటూ బ్యాట్ ఎత్తి విరాట్ చేసినట్లుగా చేతితో సైగలు చేశాడు. ‘నేను కాదు నా బ్యాట్ మాట్లాడుతుంది’ అంటూ తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా సైగలు చేశాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా కోహ్లీని గుర్తుచేసుకుంటూనే షబ్బీర్‌కు  అభినందనలు తెలియజేశారు. 

కానీ, న్యూజిలాండ్‌తో తలపడిన మూడు వన్డేల్లోనూ బంగ్లాదేశ్ పేలవంగా ఓడిపోయింది. అంతకుముందు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమి ఎదుర్కొన్న కివీస్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ల్లో క్లీన్ స్వీప్ చేసి గెలిచింది.