KS Bharat: భారత్ జట్టులో ఆంధ్రా కుర్రాడు.. టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్.. అమ్మను హత్తుకొని భావోద్వేగానికి గురైన క్రికెటర్ ..

నాగ్‌పూర్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కే.ఎస్. భరత్ చోటుదక్కించుకున్నాడు. భరత్‌కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్‌ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు.

KS Bharat: నాగ్‌పూర్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కే.ఎస్. భరత్ చోటుదక్కించుకున్నాడు. భరత్‌కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్‌ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు. అంతకుముందు బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేసింది. భరత్ టీమిండియా తుది జట్టులో ఎంపికైన వెంటనే ఈ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో భరత్ కొత్త జెర్సీని అందుకున్నాడు. ఆ జెర్సీ నెం. 14. ఈ సందర్భంగా భరత్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజంటూ, టెస్ట్ అరంగ్రేటం కోసం తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆ వీడియోలో భరత్ గుర్తు చేసుకున్నారు.

India vs Australia Test: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. లైవ్ అప్‌డేట్

భారత్ రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు గత ఏడాది చివర్లో ప్రమాదం జరిగింది. దీంతో పంత్ తాత్కాలికంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా మేనేజ్మెంట్ తాత్కాలిక వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ను కొనసాగిస్తోంది. అయితే అతను రెగ్యూలర్ కీపర్ కాకపోవటంతో ఇషాన్ కిషన్ కు అవకాశం కల్పించింది. ఇషాన్ బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా, భారత్ టెస్టు సిరీస్‌కు ఆంధ్రా యువకుడు భరత్‌కు అవకాశం దక్కింది. గురువారం ఉదయం నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తుదిజట్టులో భరత్ కు అవకాశం దక్కింది.

 

కే.ఎస్. భరత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన వ్యక్తి. భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు భరత్ ఒక్క టెస్టు మ్యాచ్‌కూడా ఆడలేదు. 2021లో న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో కీపర్ వృద్ధిమాన్ సాహాకు గాయం కావడంతో సబ్‌స్టిట్యూట్ భరత్ కు అవకాశం దక్కింది. ఆ సమయంలో భరత్ చక్కని ప్రతిభను కనబర్చి అందరినీ ఆకట్టుకున్నాడు. భరత్‌కు దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్‌లలో‌ కీపింగ్ చేసిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున పలు ఐపీఎల్ మ్యాచ్ లలో భరత్ ఆడాడు.

 

ఇదిలాఉంటే.. భరత్ టెస్ట్ క్యాప్ అందుకున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులు స్టేడియంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా భరత్ తన తల్లిని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

భరత్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు..

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా ఇండియా జట్టులో చోటు దక్కించుకొని టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆంధ్రా కుర్రాడు, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భారత్‌కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భరత్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన జగన్.. అభినందనలు తెలిపారు. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

ట్రెండింగ్ వార్తలు