వీడియో: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. సూపర్ రికార్డ్!

  • Published By: vamsi ,Published On : January 5, 2020 / 08:06 AM IST
వీడియో: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. సూపర్ రికార్డ్!

న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో కవీస్ హిట్టర్ లియో కార్టర్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. టోర్నీలో భాగంగా నార్తరెన్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లియో కార్టర్ కేవలం 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో 70పరుగులు చేశాడు. దీంతో 220 పరుగుల లక్ష్యాన్ని కాంటర్‌బురే టీమ్ 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. క్రికెట్ ప్రపంచంలో ఇప్పటివరకూ ఆరుగురు క్రికెటర్లకు మాత్రమే ఆరు సిక్సర్లు బాదిన రికార్డు ఉంది. 

మ్యాచ్‌లో కాంటర్‌బురే టీమ్ విజయానికి చివరి 30 బంతుల్లో 64 పరుగులు అవసరం అవగా.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు స్పిన్నర్ అన్టన్ డేవిచ్ వచ్చాడు. ఆ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన లియో కార్టర్.. వరుసగా 6, 6, 6, 6, 6, 6 అంటూ ఆరు సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని చేరుకున్నాడు. ఆ ఓవర్ ముగిసే సమయానికి ఇక 24 బంతుల్లో 28 పరుగులు చెయ్యాలి అన్నట్లుగా మారిపోయింది గ్రాండ్‌హోమ్ (49 నాటౌట్)తో కలిసి 18.5 ఓవర్‌లోనే 222పరుగులు చేసి కార్టర్ జట్టుకు విజయం దక్కేలా చేశాడు.

క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్ల విషయానికి వస్తే.. భారత్ నుంచి యువరాజ్, రవిశాస్త్రి మాత్రమే ఉన్నారు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్.. ఇంగ్లాండ్‌పై ఆరు సిక్సర్లు బాదాడు. 1985లో రవిశాస్త్రి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరు సిక్సర్లు నమోదు చేశాడు. ఇక వేరే దేశాలలో 1968‌లో గ్యారీ సోబర్స్ తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో గిబ్స్ (దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డ్‌ క్రియేట్ చేశాడు. ఇటీవలికాలంలో 2017లో రాస్ విట్లీ, 2018లో హజ్రతుల్లా వరుసగా టీ20ల్లో  ఈ జాబితాలో చేరారు. లేటెస్ట్‌గా లియో కార్టర్ ఈ ఫీట్ సాధించాడు.