LSGVsDC IPL2023 : ఢిల్లీపై లక్నో భారీ విజయం, దడదడలాడించిన వుడ్

ఈ మ్యాచ్ లో లక్నో జట్టు భారీ విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

LSGVsDC IPL2023 : ఢిల్లీపై లక్నో భారీ విజయం, దడదడలాడించిన వుడ్

LSGVsDC IPL2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు భారీ విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసింది. దీంతో 50 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

Also Read..IPL 2023: ధోనీ, విలియమ్సన్.. తదుపరి మ్యాచ్‌కు ఆ ఇద్దరూ దూరమవుతారా ..?

194 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీని.. లక్నో బౌలర్ మార్క్ వుడ్ దెబ్బకొట్టాడు. మార్క్ వుడ్ ధాటికి ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ కెప్టెన్ వార్నర్ 56, రోసో 30, అక్షర్ 16 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

లక్నో బౌలర్లలో మార్క్ వుడ్ 5 వికెట్లు తీసి ఢిల్లీ ఓటమిని శాసించాడు. రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ఓపెనర్ కైల్ మేయర్స్ మొదలు ఆఖర్లో వచ్చిన కృష్ణప్ప గౌతమ్ వరకు కసిదీరా బాదారు. ముఖ్యంగా మేయర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Also Read..IPL 2023, PBKS vs KKR: వర్షం అడ్డంకి.. D/L methodతో ఫలితం.. 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయ దుందుభి

కెప్టెన్ కేఎల్ రాహుల్ (8) ఆరంభంలోనే ఔట్ అయినా, మరో ఓపెనర్ కైల్ మేయర్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి.

మిడిలార్డర్ లో నికోలాస్ పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేశాడు. ఆయుష్ బదోనీ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాటింగ్ కు దిగిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ కృష్ణప్ప గౌతమ్ భారీ సిక్స్ తో మ్యాచ్ ముగించాడు.

స్కోర్లు..
లక్నో- 20 ఓవర్లలో 193/6
ఢిల్లీ – 20 ఓవర్లలో 143/9