Wrestlers Protest: తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు.. రెజ్ల‌ర్ల‌కు కపిల్ సేన విన్న‌పం

త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ని ప‌క్షంలో తాము సాధించిన ప‌త‌కాల‌ను గంగా న‌దిలో కలిపేస్తామ‌ని రెజ్ల‌ర్లు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో 1983 ప్రపంచకప్ విజేతగా నిలిచిన‌ క‌పిల్ నేతృత్వంలోని జ‌ట్టు రెజ్ల‌ర్ల‌కు విన్న‌పం చేసింది.

Wrestlers Protest: తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు.. రెజ్ల‌ర్ల‌కు కపిల్ సేన విన్న‌పం

Wrestlers Protest

Wrestlers-1983 World Cup winning team: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌(Brij Bhushan Sharan)పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన రెజ్ల‌ర్లు(Wrestlers) త‌మ ఆందోళ‌న‌ల‌ను తీవ్ర త‌రం చేస్తున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని, అత‌డిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ని ప‌క్షంలో తాము సాధించిన ప‌త‌కాల‌ను గంగా న‌దిలో కలిపేస్తామ‌ని రెజ్ల‌ర్లు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో 1983 ప్రపంచకప్ విజేతగా నిలిచిన‌ క‌పిల్ నేతృత్వంలోని జ‌ట్టు రెజ్ల‌ర్ల‌కు విన్న‌పం చేసింది. ప‌త‌కాల‌ను గంగా న‌దిలో నిమ‌జ్జ‌నం చేయ‌వ‌ద్ద‌ని కోరింది. ఈ విష‌యంలో తొంద‌ర‌పాటు త‌గ‌ద‌ని పేర్కొంది. “మా ఛాంపియన్ రెజ్లర్ల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన దృశ్యాలను చూసి మేము బాధపడ్డాము మరియు కలవరపడ్డాము. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము ”అని 1983 ప్రపంచ కప్ విజేత జట్టు విడుద‌ల చేసిన  ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Wrestlers protest: గంగలో విసిరేస్తామన్నారు, ఏమైంది?.. రెజ్లర్లపై మరోసారి విరుచుకుపడ్డ బ్రిజ్ భూషణ్

‘ఆ పతకాల వెనుక ఎంతో కృషి, త్యాగం సంక‌ల్పం ఉంది. అవి కేవ‌లం వారికి మాత్ర‌మే సొంతం కావు. అవి దేశ ప్ర‌తిష్ఠ‌కు సంబంధించిన‌వి. ఈ విష‌యంలో వారు ఎలాంటి తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని వారిని కోరుతున్నాము. అదే స‌మ‌యంలో వారి మనోవేదనలను త్వరగా విని పరిష్కరిస్తారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.’ చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ఉంది.

గ‌త ఆదివారం రోజున పార్ల‌మెంట్ భ‌వ‌నం వైపు ర్యాలీగా వెళ్లేందుకు య‌త్నించిన రెజ్ల‌ర్ల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు. అదే స‌మ‌యంలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష చేసేందుకు అనుమ‌తి నిరాక‌రించారు. ఈ ప‌రిణామాల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేసిన రెజ్ల‌ర్లు.. తాము సాధించిన ప‌త‌కాల‌ను గంగా న‌దిలో నిమ‌జ్జ‌నం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అన్న‌ట్లుగానే మంగ‌ళ‌వారం సాయంత్రం హ‌రిద్వార్‌కు చేరుకున్నారు. అయితే.. రైతు సంఘాల నాయ‌కుల విజ్ఞ‌ప్తితో వెన‌క్కి త‌గ్గారు. ప్ర‌భుత్వానికి ఐదు రోజుల స‌మ‌యం ఇచ్చారు.

Wrestlers protest: ప‌త‌కాల నిమ‌జ్జ‌నానికి బ్రేక్‌.. కేంద్రానికి 5 రోజుల గ‌డువు