IPL 2023 Final: నాకు నిద్ర కూడా పట్టలేదు..! ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి గురించి మౌనంవీడిన గుజరాత్ బౌలర్
మ్యాచ్ ఓటమి తరువాత తనను అందరూ ఓదార్చారు. తొలి నాలుగు బాల్స్ బాగా వేసినప్పటికీ చివరి రెండు బాల్స్‌లో విజయం చెన్నై సూపర్ కింగ్స్ వైపుకు వెళ్లిపోయింది.

Mohit Sharma
Mohit Sharma: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు, అభిమానుల్లో ఆనందాన్ని నింపగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యుల్లో పీడకలను మిగిల్చింది. గుజరాత్ గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌ను చివరి రెండు బంతుల్లో జడేజా చెన్నై జట్టు వైపుకు లాక్కెళ్లడం గుజరాత్ ప్లేయర్లకు బాధను మిగిల్చింది. ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ.. గుజరాత్ జట్టు ఓటమి తనకు ఎంతో బాధగా అనిపించిందని అన్నారు.
IPL 2023: వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఐపీఎల్ ట్రోపీకి సీఎస్‌కే యాజమాన్యం పూజలు.. ఫొటోలు వైరల్
మేము గెలుస్తాం అనుకున్న మ్యాచ్‌లో చివరి బంతికి ఓడిపోవటం నాకు ఇంకా ఓ పీడకలలా ఉందని చెప్పాడు. నేను నిద్రపోలేదు. నేను ఏదైనా డిఫరెంట్‌గా చేసుంటే గెలిచే వాళ్లమేమో అనే ఆలోచనతో నిద్రపట్టలేదని మొహిత్ శర్మ చెప్పాడు. ఏదో కోల్పోయినట్లు బాధగా ఉందని, కానీ, దాన్ని పక్కన పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నానని అన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు మ్యాచ్ వస్తే ఆ ఓవర్ నేనే వేయాల్సి వస్తుందని ముందు అనుకున్నానని, ఆ పరిస్థితుల్లో బౌలింగ్ ఎలా చేయాలన్నదానిపై నెట్‌లో సాధన చేయడం జరిగిందని చెప్పాడు. అనుకున్నట్లుగానే ఫైనల్ మ్యాచ్‌లో ఫైనల్ ఓవర్ నేనే వేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో బాగా బౌలింగ్ చేస్తానని నమ్మానని మోహిత్ తెలిపాడు.
చివరి ఓవర్లో అన్ని బాల్స్ యార్కర్లు వేయాలని నిర్ణయించుకున్నా. తొలి నాలుగు బాల్స్‌కు మూడు పరుగులే రావడంతో మా జట్టు సభ్యులుసైతం మనదే విజయం అన్న ధీమాకు వచ్చేశారు. చివరి రెండు బాల్స్‌లోకూడా యార్కర్స్ వేయాలని అనుకున్నా.. ఐదో బంతిని జడేజా సిక్స్ కొట్టాడు. చివరి బంతి జడేజా కాళ్ల వద్దపడేలా బాల్‌ను యార్కర్ రూపంలో వేయాలని అనుకున్నా.. కానీ, అది పడకూడని చోట పడింది. జడేజా దానిని ఫోర్ కొట్టాడు అని మోహిత్ వివరించాడు.
IPL 2023 Final: జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్న ధోనీ.. వీడియో వైరల్.. సీఎస్‌కే ఫ్యాన్స్ ఖుషీఖుషీ
మ్యాచ్ ఓటమి తరువాత తనను అందరూ ఓదార్చారు. తొలి నాలుగు బాల్స్ బాగా వేసినప్పటికీ చివరి రెండు బాల్స్‌లో విజయం చెన్నై సూపర్ కింగ్స్ వైపుకు వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి నాకు నిద్రకూడా పట్టలేదు. ఒకటే ఆలోచనలు.. నేను బంతిని అలావేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఆ బాధ మరికొద్ది రోజులు ఉంటుంది. అయినప్పటికీ నేను ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాను అని మోహిత్ శర్మ చెప్పాడు.