MS Dhoni: శస్త్రచికిత్స తరువాత ఎయిర్‌పోర్టులో ధోని.. కెప్టెన్ కూల్ ఫ్యామిలీని కలిసిన టీమ్ఇండియా మాజీ ఆటగాడు
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతుండడంతో గురువారం సర్జరీ చేయించుకున్నాడు. రెండు మూడు రోజులు పాటు ఆస్పత్రిలో ఉన్న మహేంద్రుడు నేడు(సోమవారం జూన్ 5) తన స్వస్థలమైన రాంచీకి బయలుదేరాడు.

MS Dhoni-Mohammad Kaif
MS Dhoni-Mohammad Kaif: టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) మోకాలి గాయంతో బాధపడుతుండడంతో జూన్ 1 గురువారం సర్జరీ చేయించుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజులు పాటు ఆస్పత్రిలో ఉన్న మహేంద్రుడు నేడు(సోమవారం జూన్ 5) తన స్వస్థలమైన రాంచీకి బయలుదేరాడు.
కాగా..ఎయిర్‌పోర్టులో మహేంద్ర సింగ్‌ధోని ని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తన కుటుంబంతో వెళ్లి కలిశాడు. ధోని ఫ్యామిలీతో కలిసి కైఫ్ కుటుంబం ఫోటోలు దిగింది. ఈ విషయాన్ని స్వయంగా కైఫ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
‘మేము ఈ రోజు విమానాశ్రయంలో ఓ గొప్ప వ్యక్తిని, అతని కుటుంబాన్ని కలిశాము. శస్త్రచికిత్స అనంతరం అతడు ఇంటికి తిరిగి వెలుతున్నాడు. తన చిన్నతనంలో ఫుట్‌బాల్ ఆడేవాడినని నా కుమారుడు కబీర్‌తో ధోని చెప్పడంతో కబీర్ చాలా సంతోషించాడు. త్వరగా కోలుకోండి. తరువాతి సీజన్‌లో కలుద్దాం ఛాంపియన్.’ అంటూ కైఫ్ రాసుకొచ్చాడు. ధోనితో కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
MS Dhoni: శుభవార్త.. ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
We met the great man and his family at airport today. He was returning home after surgery. Son Kabir super happy as Dhoni told him he too, like him, played football as a kid. Get well soon, see you next season champion.@msdhoni pic.twitter.com/ZVoKjxhudu
— Mohammad Kaif (@MohammadKaif) June 5, 2023
ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఓ వైపు గాయం వేధిస్తున్నా కూడా కీపింగ్‌లో ఎక్కడా కూడా ఆ ప్రభావం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఆఖరి రెండు లేదా మూడు ఓవర్లలో బ్యాటింగ్ కు వచ్చి భారీ షాట్లను మాత్రమే కొట్టాడు. వికెట్ల మధ్య తనను పరుగులు పెట్టించవద్దని తన సహచరులతో ధోని చెప్పాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ధోని నేరుగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి వచ్చాడు. ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇక ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగగా తాను మరొక సీజన్ ఆడేందుకు ప్రయత్నిస్తానని ధోని అభిమానులకు వాగ్దానం చేశాడు. అయితే.. ఇందుకు తన శరీరం సహకరించాల్సిన అవసరం ఉందన్నాడు.