MS Dhoni poultry farming: నల్ల కోళ్ల వ్యాపారంలోకి ధోనీ

  • Published By: vamsi ,Published On : November 15, 2020 / 10:40 AM IST
MS Dhoni poultry farming: నల్ల కోళ్ల వ్యాపారంలోకి ధోనీ

MS Dhoni poultry farming: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌లో అయినా.. జీవితంలో అయినా తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ధోనీ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. ఎవరూ ఊహించలేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ధోని ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా క్రికెట్ నుండి నిష్క్రమించిన తరువాత, ఆటగాళ్ళు కోచింగ్ లేదా కామెంటరీ వంటి విషయాల వైపు మొగ్గు చూపుతారు, కానీ, ధోనీ మొదట వ్యవసాయం వైపు ఆలోచించగా.. ఇప్పుడు పౌల్ట్రీ వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.



మాజీ కెప్టెన్ ధోనీ ఇప్పుడు కడక్‌నాథ్‌ కోళ్ల(నల్ల కోళ్లు) వ్యాపారం చెయ్యబోతున్నట్లు తెలుస్తుంది. కడక్‌నాథ్‌ అనేవి ఒక ప్రత్యేక జాతి కోడి. ఇది నలుపు రంగులో ఉంటుంది, ఆహారంలో రుచికరమైనది మరియు పోషక లక్షణాలను కలిగి ఉంటుంది. ధోనీ ఇప్పుడు ఈ కోళ్లకు సంబంధించిన వ్యాపారమే చెయ్యబోతున్నాడు. ఇందుకోసం ధోనీ 2వేల కడక్‌నాథ్‌ కోళ్లను కూడా ఆర్డర్ చేశాడు. సాంబోలోని ఫామ్ హౌస్‌లో ఈ కోళ్లన్నింటినీ పెంచాలని ధోని యోచిస్తున్నాడు.



మధ్యప్రదేశ్ నుండి ఆర్డర్ చేయబడిన రెండు వేల కోళ్లలో నుంచి గుడ్ల ద్వారా హేచరీని తయారు చేయాలని ధోనీ భావిస్తున్నారు. కడక్‌నాథ్‌ కోళ్ల చికెన్‌కు చాలా డిమాండ్ ఉంది. ఈ కోడి జాతిలో ఔషధ గుణాలు కనిపిస్తాయి. దాని మాంసాన్ని తినడం ద్వారా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. ఐరన్ లోపం అధిగమించబడుతుంది. కడక్‌నాథ్‌ జాతుల కోళ్ల ధర ప్రస్తుతం మార్కెట్లో 3 నుండి 4 వేల రూపాయలు వరకు ఉంది. మీరు కోళ్లను తెచ్చి వాటిని పెంచుకుంటే, 6 నుండి 7 నెలల తర్వాత గుడ్లు పెడతాయి. కానీ ఒక కోడి 400 నుండి 500 రూపాయలకు వస్తుంది.



కడక్‌నాథ్‌ కోళ్ల చికెన్ ఖరీదైనదిగా అమ్ముతుండగా, దేశంలో అత్యంత ఖరీదైన గుడ్డు కడక్‌నాథ్‌ కోళ్ల గుడ్డు. కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకం చాలా కష్టతరం. అయితే కడక్‌నాథ్‌ మాంసంలో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువ. సాధారణ చికెన్‌లో కేజీ మాంసానికి 214 మి.గ్రా. కొలెస్టరాల్, 16-17 శాతం ప్రొటీన్స్ ఉంటాయి. అదే కడక్‌నాథ్ చికెన్‌లో కేజీ మాంసానికి 184 మి.గ్రా. కొలెస్టరాల్, 27-28 శాతం ప్రోటీన్స్ ఉంటాయి. అందులో ఉన్న పోషక విలువ కారణంగా కడక్‌నాథ్ కోడిమాంసం కిలో రూ.700 నుంచి వెయ్యి దాకా పలుకుతోంది. కోడి పిల్ల ఖరీదు రూ. 100. ఒక్క కోడి గుడ్డును రూ.50కు అమ్ముతున్నారు.