‘ధోనీ సైలెంట్‌గా రిటైరైపోతాడు’

‘ధోనీ సైలెంట్‌గా రిటైరైపోతాడు’

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైలెంట్‌గా రిటైరైపోతాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరులో జరగనున్న టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమే అని గవాస్కర్ అభిప్రాయం. 

‘నేను ధోనీ వరల్డ్ కప్ బృందంలో ఉంటాడని ఆశిస్తున్నా. కానీ, అది అసాధ్యమే అనిపిస్తుంది. జట్టు బాగానే కనిపిస్తుంది. మధ్యలో ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం లేదు. అందుకే క్రికెట్ నుంచి ధోనీ సైలెంట్ గా వీడ్కోలు చెప్పేస్తాడనిపిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019వరల్డ్ కప్‌లో ధోనీ చివరిసారిగా ఆడాడు. సెమీ ఫైనల్స్ మ్యాచ్‌‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొందిన తర్వాత మరో మ్యాచ్ లో కనిపించలేదు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడతాడని ఎదురుచూశారు అభిమానులు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా వేయడంతో మరోసారి నిరాశ తప్పలేదు. 

భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం ఐపీఎల్ లో ప్రదర్శన బట్టి టీ20వరల్డ్ కప్ లో ఎంపిక ఉంటుందని చెప్పాడు. మార్చి 29 నుంచి ఐపీఎల్ ఆరంభం కావాల్సి ఉంది. దానిని ఏప్రిల్ 15వరకూ వాయిదా వేశారు. చెన్నై సూపర్ కింగ్స్ బృందం ఐపీఎల్ కోసం ఇప్పటికే శిక్షణలో ఉన్నారు.