IPL-2020 MI vs CSK: ధోనీసేన లక్ష్యం 163.. ముంబైని ధీటుగా ఎదుర్కోగలదా?

  • Published By: sreehari ,Published On : September 19, 2020 / 09:30 PM IST
IPL-2020 MI vs CSK: ధోనీసేన లక్ష్యం 163.. ముంబైని ధీటుగా ఎదుర్కోగలదా?

IPL-2020 MI vs CSK: ఐపీఎల్‌-13 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ 162 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ సేన కట్టడి చేయడంతో 20 నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 162 పరుగులు చేసింది.. దీంతో ధోనీసేనకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ (12), డికాక్ (33) పరుగులు చేశారు. ఆదిలోనే రెండేసి వికెట్లు కోల్పోవడంతో ముంబై సాధారణ స్కోరుకే పరిమితమైంది.



16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఒకే ఓవర్‌లో ముంబై రెండు వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా వేసిన 15 ఓవర్‌ తొలి బంతికి సౌరవ్‌ తివారీ(42) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద చేతులేత్తేశాడు. డుప్లెసిస్‌.. తివారీ ఇచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో అదుపు చేసుకోలేక బౌండరీ దాటేశాడు. పట్టుకున్న బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ దాటేశాడు.. మళ్లీ లోపలికి వచ్చి బంతి క్యాచ్‌ పట్టుకున్నాడు.



సౌరవ్ తివారి (31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) 42 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువలో వెనుదిరిగాడు. రోహిత్, డికాక్ తర్వాత బరిలోకి దిగిన సూర్యకుమార్ (17)తో తివారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. మూడో వికెట్ కు వీరిద్దరి భాగస్వామ్యం అందించారు. హార్దిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టేందుకు విఫలయత్నం చేశాడు.



పాండ్యా కొట్టిన బంతి డుప్లెసిస్‌ క్యాచ్‌ పట్టుకోవడంతో పాండ్యా వెనుదిరక తప్పలేదు. ఆ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. కీరన్ పోలార్డ్ (18) పెవిలియన్ చేరడంతో ముంబైకు నిరాశే మిగిలింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీశాడు.. జడేజా, దీప్ చాహర్ తలో రెండు వికెట్లు తీశారు. కరన్, చావ్లా, తలో వికెట్ తీశారు. బౌలింగ్‌లో రాణించి ముంబైని కట్టడి చేసిన ధోనీసేన ముందు లక్ష్యమే చిన్నదే అయినా బ్యాటింగ్‌లో అదే దూకుడుతో ధీటుగా ఎదుర్కోగలదో లేదో చూడాలి మరి..