Tokyo Olympics 2020: ఇండియాకు తొలి స్వర్ణం.. పసిడి కొట్టిన నీరజ్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ ఆరంభం రనుంచి దూకుడుగా కనిపించిన నీరజ్ చోప్రా ఎట్టకేలకు స్వర్ణం సాధించారు.

Tokyo Olympics 2020: ఇండియాకు తొలి స్వర్ణం.. పసిడి కొట్టిన నీరజ్

Neeraj Chopra Wins Gold Medal In Javellin Throw

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా కనిపించిన నీరజ్ చోప్రా ఎట్టకేలకు స్వర్ణం సాధించారు. 13ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇండియాకు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం దక్కింది. 2008లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ తెచ్చిపెడితే ఇన్నేళ్లకు నీరజ్ ఆ ఫీట్ సాధించారు.

ఫైనల్ మ్యాచ్ జరిగిందిలా:
ఫుల్ ఫామ్‌లో ఉన్న నీరజ్.. మొదటి అవకాశంలోనే 87.03 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మరింత మెరుగుపరుస్తూ.. ఈ 87.58 మీటర్లు విసిరి పతక పోటీలో ముందుకెళ్లాడు. మూడోసారి మాత్రం 76.79కి పరిమితం అయ్యాడు. ఆ తర్వాత రెండు ఫౌల్స్‌ పడ్డాయి. ఆరో రౌండ్‌లో 84.24 మీటర్లు విసిరాడు. పోటీ మొత్తంలో పాల్గొన్న అథెట్లలో అత్యధిక మీటర్లు (87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి స్వర్ణ పతకం ముద్దాడాడు.

నీరజ్‌ తర్వాత చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్‌(86.67 మీటర్లు)కు రజతం దక్కింది. అదే దేశానికి చెందిన మరో అథ్లెట్‌ విటెడ్జ్‌స్లావ్‌(85.44 మీటర్లు)కు కాంస్యం సొంతమైంది.

అంతకుముందు జరిగిన గేమ్:
గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు.

జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది. లేదంటే తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. అయితే నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు జావెలిన్‌ను విసరడంతో ఆటోమేటిక్‌గా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. అలాగే ఈ సీజన్‌లో అతనికి అత్యుత్తమ త్రో కావడం విశేషం.