రెండు వారాలు పాటు ఐపీఎల్ వాయిదా?

  • Published By: vamsi ,Published On : March 13, 2020 / 08:19 AM IST
రెండు వారాలు పాటు ఐపీఎల్ వాయిదా?

ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ తుది నిర్ణయం రేపు(14 మార్చి 2020) తీసుకోబోతుంది. ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఇండియాను పట్టుకుంది. ఇప్పటికే వందల సంఖ్యలో అనుమానితులు.. పదుల సంఖ్యలో ఖరారైన కేసులు.. ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రీడలపై ఈ కరోనా ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాలా సిరీస్‌లు అలాగే మెగా టోర్నీలు వాయిదా పడ్డాయి.

ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే టోక్యో 2020 ఒలింపిక్స్‌ వాయిదా వేసే అవకాశం కనిపిస్తుండగా.. అంతర్జాతీయంగా ఇప్పటికే జరగాల్సిన క్రీడా పోటీలు, ఒలింపిక్‌ ఈవెంట్లు కూడా రద్దు అయ్యాయి. ఎక్కువగా జనాభా గుమికూడే పరిస్థితులను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనా ప్రభావిత దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మన దేశంలో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్ రెండు వారాలు పాటు వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. 

భారత్‌ వేదికగా మార్చి 29వ తేదీన ప్రారంభం అవనున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పడిప్పుడే ఇండియాలో ప్రవేశించిన కరోనా వైరస్ ఐపీఎల్ కారణంగా ఇంకా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందులో భాగంగానే ఈ ఐపీఎల్ పై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఐపీఎల్ నిర్వహించకూడదని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేయగా ఐపీఎల్ కు అతిథ్యం ఇవ్వలేమని కర్ణాటక.. మహారాష్ట్ర కూడా అంటుంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఐపీఎల్ నిర్వహించలేమంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా కూడా ఓ ప్రకటన చేశారు. 

దీంతో ఐపీఎల్ నిర్వహణపై చర్చించడానికి ఐపీఎల్ పాలక మండలి ఫ్రాంచైజీలన్నింటినీ మీటింగ్‌కి ఆహ్వానించింది. ఈ సమావేశంలో ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపిఎల్ ) ప్రారంభం కావడానికి ఇంక కేవలం 16 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 70మంది విదేశీ క్రికెటర్లు, డజనుకు పైగా ఎలైట్-ప్యానెల్ అంపైర్లు మరియు మ్యాచ్ రిఫరీలు, వివిధ దేశాల నుండి అనేక మంది వ్యాఖ్యాతలు మరియు మీడియా వస్తుంది. దీంతో అసలు ఐపీఎల్ నిర్వహించాలా వద్దా? అనే విషయం రేపు తేలనుంది.

See More :

కరోనా ఎఫెక్ట్….IPL 2020 రద్దు!

ప్రేక్షకులు లేకుండానే..IPL మ్యాచ్‌లు!