Preity Zinta: మ్యాచ్ గెలిస్తే అలా చేస్తానంటూ ప్రీతిజింటా ఆఫర్.. విజయం సాధించి చెమటలు పట్టించిన ఆటగాళ్లు
పంజాబ్ జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని, ఆ దెబ్బతో మళ్లీ పరాఠాలు చేయడం మానేసినట్లు తెలిపింది బాలీవుడ్ నటి ప్రీతిజింటా.

Preity Zinta Made 120 Aloo Paranthas
Preity Zinta: ఇండియన్ ప్రీమియర్(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 15 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 16వ సీజన్ మధ్యలో ఉంది. ఈ లీగ్‌లో బౌండరీల వర్షం మాత్రమే కాదు అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటి ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతిజింటా(Preity Zinta) తాజాగా వెల్లడించింది.
పంజాబ్ జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని, ఆ దెబ్బతో మళ్లీ పరాఠాలు చేయడం మానేసినట్లు తెలిపింది. అయితే.. ఈ ఘటన ప్రస్తుత సీజన్‌లో జరగలేదట. 2009 సీజన్‌లో జరిగిన విషయాన్ని ఇప్పుడు పంచుకుంది. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రీతి జింటా ఈ విషయాన్ని తెలిపింది. తన టీమ్ కోసం ప్రీతి జింటా ఆలూ పరాఠాలను తయారు చేస్తారని ఎవరైనా ఊహించారా..? ఆ తరువాత ఆలూ పరాఠాలు తినడం మానేశారని అనుకుంటున్నా అని యాంకర్ ప్రీతి జింటాను ప్రశ్నించగా పక్కనే ఉన్న హర్భజన్ సింగ్ నవ్వడం మొదలుపెట్టాడు.
🚨 Star Sports Exclusive 🚨
Throwback to when @realpreityzinta discovered that her @PunjabKingsIPL side have an appetite for more than just winning! 🤣Tune-in to #PBKSvLSG at #IPLonStar
Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/XpeYglFUSf— Star Sports (@StarSportsIndia) April 28, 2023
‘అబ్బాయిలు ఎంత తింటారో నాకు అప్పుడు(2009లో) మొదటిసారి అర్థమైంది. అప్పుడు మేము దక్షిణాఫ్రికాలో ఉన్నాం. వారు అందించిన పరాఠాలు రుచికరంగా లేవు. దీంతో వారికి నేను పరాఠాలు ఎలా చేయాలో చెప్పాను. దీన్ని చూసిన అబ్బాయిలు(పంజాబ్ ఆటగాళ్లు) మా కోసం పరాఠాలు చేయమని అడిగారు. అయితే.. తదుపరి మ్యాచ్ గెలిస్తే తప్పకుండా చేస్తా అని వారికి మాట ఇచ్చా. వాళ్లు మ్యాచ్ గెలిచారు. ఇచ్చిన మాట ప్రకారం నేను పరాఠాలు చేయడం మొదలుపెట్టాను పది కాదు ఇరవై కాదు ఏకంగా 120 ఆలూ పరాఠాలు చేశాను. ఆ దెబ్బతో పరాఠాలు చేయడం మానేశాను.’ అని ప్రీతి జింటా ఆనాటి సంగతి చెప్పుకొచ్చింది. ప్రీతిజింటా చెప్పింది మొత్తం విన్న హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 20 పరాఠాలు తిన్నాడు అని చెప్పాడు. ఇక ఆఖర్లో మా జట్టు మళ్లీ ట్రాక్‌లో పడాలంటే మళ్లీ ఆలూ పరాఠాలు చేయాలేమో అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.
IPL 2023, PBKS vs LSG: పంజాబ్ చిత్తు.. లక్నో ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం
ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్(73; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కైల్ మేయర్స్(54; 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లు దంచికొట్టగా నికోలస్ పూరన్(45; 18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆయుష్ బదోని(43; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా, అర్ష్ దీప్ సింగ్, సామ్ కరన్, లివింగ్ స్టోన్ ఒక్కొ వికెట్ పడగొట్టారు. లక్ష్యఛేదనలో పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ సీజన్‌లో ఇది పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి.