ప్రొ-కబడ్డీ సిక్స్‌ సీజన్‌ : ఫైనల్లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 01:20 AM IST
ప్రొ-కబడ్డీ సిక్స్‌ సీజన్‌ : ఫైనల్లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌

ఢిల్లీ : ప్రొ-కబడ్డీ సిక్స్‌ సీజన్‌  ఫైనల్‌కు గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ దూసుకెళ్లింది. జనవరి 03వ తేదీ రాత్రి జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధపై విజయంతో గుజరాత్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. శనివారం ముంబైలో జరిగే ఫైనల్‌లో బెంగళూరు బుల్స్‌తో తలపడనుంది. లీగ్‌ దశ నుంచి పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన గుజరాత్‌.. క్వాలిఫయర్‌లోనూ అదే జోరు కొనసాగింది. రాత్రి  గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌, యూపీ యోధ మధ్య మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. పాయింట్ల కోసం పోటీపడ్డాయి. దీంతో స్కోరు పలుమార్లు సమం అయ్యింది.
రాణించిన జాదవ్…
మ్యాచ్‌ మొదలైన ఐదు నిమిషాలకు స్కోరు 5-5తో సమమైంది. అక్కడి నుంచి పలుమార్లు స్కోరు సమం అవుతూ వచ్చింది. ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే శ్రీకాంత్‌ జాదవ్‌ రాణించడంతో యూపీ 13-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత గుజరాత్‌ ఆటగాళ్లు రాణించడంతో ఫస్టాఫ్‌ ముగిసే సమయానికి గుజరాత్‌ 19-14 తో ఆధిక్యంలోకి వెళ్లింది.
యూపీ యోధ పరాజయం…
సెకండాఫ్‌లో గుజరాత్‌ మరింత జోరు పెంచింది. యూపీ యోధ స్కోరు అదే 14 దగ్గర ఉండగానే…. గుజరాత్‌ వరుస పాయింట్లతో తన స్కోరు 29కి పెంచుకుని తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో యూపీ యోధ పుంజుకుంది. గుజరాత్‌ను చిత్తు చేస్తూ వరుస పాయింట్లు రాబట్టింది. మరో రెండు నిమిషాలు ఆట ఉందనగా.. 30-35 పాయింట్లతో గుజరాత్‌ను సమీపించింది. అయితే చివరి నిమిషాల్లో వ్యూహాత్మకంగా ఆడిన గుజరాత్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరికి 31- 38 పాయింట్ల తేడాతో యూపీ యోధ గుజరాత్‌ చేతిలో ఓడిపోయింది. రైడర్ సచిన్ తన్వర్ 10 పాయింట్లతో చెలరేగగా… ప్రపంజన్‌ 5, రోహిత్ గులియా 5 పాయింట్లు సాధించి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.