Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో బోణి కొట్టిన సింధూ.. బంగారు పతకం కోసం ఆశగా భారత్!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు బోణి కొట్టింది. గ్రూప్‌-జే ఫస్ట్ మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై అలవోకగా గెలిచింది పీవీ సింధూ.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో బోణి కొట్టిన సింధూ.. బంగారు పతకం కోసం ఆశగా భారత్!

Pv Sindhu

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు బోణి కొట్టింది. గ్రూప్‌-జే ఫస్ట్ మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై అలవోకగా గెలిచింది పీవీ సింధూ. వరుస సెట్లలో 21-7, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే సింధు ఈ మ్యాచ్‌ను ముగించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు రజత పతకం గెలుచుకోగా.. ఈసారి ఆమె బంగారు పతకం తెస్తుందని భారత్ భావిస్తోంది.

మ్యాచ్‌లో పీవీ సింధుకి 58వ ర్యాంక్‌లో ఉన్న సెనియా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది ఫస్ట్ సెట్‌లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన పీవీ సింధు.. 21-7తో సెట్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సెకండ్ సెట్‌‌‌లో సెనియా కాస్త ప్రతిఘటించినా పుంజుకునే అవకాశాన్ని మాత్రం పీవీ సింధు ఇవ్వలేదు. రెండో సెట్‌ని కూడా 21-10తో చేజిక్కించుకుని మ్యాచ్‌ని సింధూ కైవసం చేసుకుంది.

అయితే, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మాత్రం భారత షూటర్లు నిరాశపరిచారు. మనుబాకర్‌, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్‌ 575 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితం కాగా, యశస్విని 574 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. చివరి షూటర్ 577 పాయింట్లతో ఫైనల్స్‌కు అర్హత సాధించారు. దీంతో రెండు పాయింట్ల తేడాతో మనుబాకర్ ఫైనల్‌కు వెళ్లలేకపోయారు.

డబుల్స్ మ్యాచ్‌లో సానియా మీర్జా, అంకితా రైనా కూడా ఓటమిపాలయ్యారు. భారత్‌ మహిళల డబుల్స్‌లో పతకం సాధించే అవకాశాలు ముగియగా.. సానియా మీర్జా, అంకితా రైనా జంట తొలి రౌండ్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ఎలిమినేట్ అయ్యింది.