IPL 2019, CSK బౌలర్ల విజృంభణ : 70పరుగులకే RCB ఆలౌట్

10TV Telugu News

చెన్నై : ఐపీఎల్ 2019 సీజన్ 12 తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు రెచ్చిపోయారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. చెన్నై బౌలర్ల ధాటికి ఆర్సీబీ కుదేలైంది. 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ జట్టులో హయ్యస్ట్ స్కోరర్ పార్ధివ్ పటేల్. పార్థివ్ 35 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి (6 రన్స్) సహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఒక్కరు కూడా రెండెంకల స్కోర్ చేయలేదు. డివిలియర్స్ కేవలం 9 పరుగులే చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ చెరో 3 వికెట్లు తీశారు. జడేజా 2 వికెట్లు తీశాడు. బ్రావో ఒక వికెట్ తీశాడు.

టాస్ గెల్చిన సీఎస్‌కే… ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోని నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చెయ్యలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ పని పట్టారు. తొలి 3 వికెట్లను హర్భజన్‌ తన ఖాతాలో వేసుకోవడం మరో విశేషం. కోహ్లి(6), మొయిన్‌ అలీ(9), ఏబీ డివిలియర్స్‌(9)ల వికెట్లను హర్భజన్‌ సాధించాడు.

ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక కాట్ అండ్‌ బౌల్డ్‌లు సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్‌ అలీని రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక కాట్ అండ్ బౌల్డ్‌లు సాధించిన జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 11 కాట్ అండ్‌ బౌల్డ్‌లతో భజ్జీ టాప్‌లో ఉన్నాడు. డ్వేన్‌ బ్రేవో(10)ను భజ్జీ అధిగమించాడు. ఈ జాబితాలో సునీల్‌ నరైన్‌(7), పొలార్డ్‌(6)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హర్భజన్‌ సింగ్‌ విజృంభణతో ఆర్సీబీ బ్యాటింగ్‌లో తడబడింది.