ముంబై ఇండియన్స్ నుంచి డబ్బులు తీసుకోలేదు: సచిన్ టెండూల్కర్

ముంబై ఇండియన్స్ నుంచి డబ్బులు తీసుకోలేదు: సచిన్ టెండూల్కర్

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడనే ఆరోపణలకు లిఖితపూర్వకమైన సమాధానమిచ్చారు. ఈ మేరకు వివరణ ఇస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్‌కు 14 పాయింట్లతో వివరణ ఇచ్చారు. ముంబై ఇండియన్స్‌ నుంచి తాను లాభం పొందడం లేదని స్పష్టం చేశారు. జట్టుకు కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నానని ఎటువంటి నిర్ణయాత్మక పాత్ర పోషించడంలేదని వెల్లడించారు. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి కేవలం ఒక ‘ఐకాన్’గా మాత్రమే ఆ జట్టుకు వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
బీసీసీఐకి సంబంధించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(CAC)లో సభ్యుడిగా ఉంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీల తరపున పనిచేస్తున్నారంటూ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు సచిన్‌పై బీసీసీఐ అంబుడ్స్‌మెన్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌తో తాను కొనసాగాలనుకుంటున్నానని సీఏసీ నుంచి తప్పుకోవడానికి లక్ష్మణ్ అంగీకరించారు. ఆ నోటీసులపై స్పందించిన సచిన్ మాత్రం సంబంధం లేదని..  ఒకవేళ అంబుడ్స్‌మన్ విచారణను ఇంకా కొనసాగించాలనే అనుకుంటే వ్యక్తిగత విచారణకు అనుమతించాలని సచిన్ కోరారు. 

నిజానికి సీఏసీలో సభ్యులుగా ఉంటున్నారే కానీ, సచిన్, లక్ష్మణ్‌లు బీసీసీఐ నుంచి ఎలాంటి జీతం పొందడం లేదు. అలా ఉన్నప్పటికీ ఐపీఎల్ జట్లతో పాటు కలిసి పనిచేయడంపై ప్రశ్నిస్తూ బీసీసీఐ నోటీసులు జారీచేయడం శోచనీయం.