Rishabh Pant: వన్డే ప్రపంచకప్ ముందు భారత అభిమానులకు శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ.!
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త అందింది.

Team India
Rishabh Pant health: ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ (ODI World Cup ) జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు ప్రపంచకప్ సాధించేందుకు ప్రిపరేషన్లు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త అందింది. గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పంత్‌కు ఇప్పటికే పలు సర్జరీలు చేశారు వైద్యులు. అతడికి మరో సర్జరీ అవసరం అని డాక్టర్లు తొలుత సూచించగా ఇప్పుడు అవసరం లేదని చెప్పారట. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ‘పంత్‌కు ఇప్పటికే పలు సర్జరీలు జరిగాయి. అతడు వేగంగా కోలుకుంటున్నాడు. మరో చిన్న సర్జరీ అవసరం అని వైద్యులు మొదట బావించారు. ఈ క్రమంలో ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి చెకప్ చేస్తున్నారు. ప్రస్తుతం పంత్ బాగానే ఉన్నాడు. దీంతో అతడికి ఇప్పుడు ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్లు చెప్పారు.’ అని అన్నారు.
ఇది చాలా మంచి వార్త అని, రిషబ్ ఊహించినదానికంటే వేగంగా కోలుకుంటున్నాడని, అతడు త్వరలోనే మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ప్రపంచకప్‌కు పంత్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరో రెండు లేదా మూడు నెలలో గ్రౌండ్‌లో పంత్ అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిసిన అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంత్ ఇంకా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో గాయపడినప్పటికి నుంచి పంత్ క్రికెట్‌కు దూరం అయ్యాడు. ఐపీఎల్-16 తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. పంత్ గైర్హజరీలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది.
IPL2023 Final: ఐపీఎల్-16 టైటిల్ విజేతగా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజరాత్ పై విజయం