చెన్నైపై బెంగళూరు విజయం.. ఐపీఎల్ 2020లో ఐదవ ఓటమి!

  • Published By: vamsi ,Published On : October 10, 2020 / 11:45 PM IST
చెన్నైపై బెంగళూరు విజయం.. ఐపీఎల్ 2020లో ఐదవ ఓటమి!

ఐపిఎల్ 2020లో 25వ మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య జరగగా.. మొదట ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు 37పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 132పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదవ ఓటమి ఇది.

అంతకుముందు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. కేవలం 13 పరుగుల స్కోరుకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ, పాడిక్కల్ జాగ్రత్తగా ఆడుతూ బెంగళూరు జట్టు స్కోరును నడిపించారు. అయితే తర్వాత ఒకేసారి వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది బెంగళూరు జట్టు. పాడిక్కల్, డివిలియర్స్ అవుట్ అయ్యారు.

52బంతుల్లో 90పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 90 పరుగుల స్కోరు కారణంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది బెంగళూరు. దీంతో చెన్నై విజయ లక్ష్యం 170 పరుగులు అయ్యింది. బెంగళూరు జట్టు 10ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 65పరుగులే చేయగా.. తర్వాత 10ఓవర్లకు 104పరుగులు చేసింది.

170పరుగుల టార్గె‌ట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పరుగులు తీయడానికి కష్టపడింది. పెద్దగా పరుగులు ఏమీ చెయ్యకుండానే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. 25పరుగులకే వాట్సన్, డూప్లెసిస్ అవుట్ అయ్యారు. 10బంతుల్లో 8పరుగులు మాత్రమే చేసి డుప్లెసిస్ 19పరుగుల వద్ద అవుట్ అవగా.. 25పరుగులు వద్ద 18బంతుల్లో 14పరుగులు చేసి వాట్సన్ అవుట్ అయ్యాడు. తర్వాత కాసేపు రాయుడుతో కలిసి పరుగులు రాబడుతూ ఎన్ జగదీషన్ 28 బంతుల్లో 33 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

తర్వాత చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాడు 6 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత సామ్ కుర్రాన్ గోల్డెన్ డక్ అయి పెవిలియన్ చేరాడు. ఆరో వికెట్‌గా అంబటి రాయుడు 40 బంతుల్లో 42 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. 7 పరుగులు చేసిన డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏడవ వికెట్.. 7 పరుగులు మాత్రమే చేయగలిగిన రవీంద్ర జడేజా 8 వ వికెట్‌గా పెవిలియన్‌కు తిరిగి వచ్చారు. దీపక్ చాహర్ 5 పరుగులు, శార్దుల్ ఠాకూర్ 1 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు,

షార్దుల్ ఠాకూర్ చెన్నై తరఫున గరిష్టంగా రెండు వికెట్లు తీశాడు, కాని అతను తన నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. సామ్ కర్రన్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.