Suryakumar Yadav:స్కైతో అట్టానే ఉంటుంది.. క్రికెట్ దేవుడే సూర్య షాట్‌కు ఆశ్చ‌ర్య‌పోయాడుగా..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) అద్భుత విన్యాసాలు కొన‌సాగుతున్నాయి. అభిమానులంద‌రూ క్రికెట్ గాడ్ గా పిలుచుకునే స‌చిన్ టెండూల్క‌ర్‌కు సైతం సూర్య కొట్టిన ఓ షాట్‌కు ఆశ్చ‌ర్య‌పోయాడు.

Suryakumar Yadav:స్కైతో అట్టానే ఉంటుంది.. క్రికెట్ దేవుడే సూర్య షాట్‌కు ఆశ్చ‌ర్య‌పోయాడుగా..!

Suryakumar Yadav’s Unique Shot (Photo: @IPL)

Suryakumar Yadav-Sachin Tendulkar: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) అద్భుత విన్యాసాలు కొన‌సాగుతున్నాయి. 360 డిగ్రీ ఆట‌తో మైదానాన్ని వీడియో గేమ్‌లాగా మార్చేస్తున్నాడు. ఇలా కూడా బంతిని కొట్టొచ్చా అనే సందేహం క‌లిగేలా కొత్త కొత్త షాట్ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు సూర్య‌. ఇక శుక్ర‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు.

17 ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి 53 ప‌రుగులతో ఉన్న సూర్య.. ఇన్నింగ్స్‌ ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి ఐపీఎల్‌లో త‌న మొద‌టి సెంచ‌రీ చేశాడంటే అత‌డి విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. మొద‌టి 50 ప‌రుగుల‌కు 32 బంతులు తీసుకున్న సూర్య‌కుమార్ చివ‌రి 17 బంతుల్లో 53 ప‌రుగులు చేశాడు. అత‌డు కొట్టిన కొన్ని షాట్ల‌ను చూడాల్సిందే త‌ప్ప మాటల్లో వ‌ర్ణించ‌లేం.

Suryakumar Yadav:స్కైతో అట్టానే ఉంటుంది.. క్రికెట్ దేవుడే సూర్య షాట్‌కు ఆశ్చ‌ర్య‌పోయాడుగా..!

ముంబయి మెంటార్‌, అభిమానులంద‌రూ క్రికెట్ గాడ్ గా పిలుచుకునే స‌చిన్ టెండూల్క‌ర్‌కు సైతం సూర్య కొట్టిన ఓ షాట్‌కు ఆశ్చ‌ర్య‌పోయాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతిని షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా స్లైస్‌ చేసినట్లు ఆడిన సూర్య దానిని సిక్స్‌గా మలిచాడు. సూర్య కొట్టిన విధానానికి ముగ్ధుడైన టెండూల్క‌ర్‌.. ఆ షాట్‌ను సూర్య ఎలా ఆడాడనేది తన హావ‌భావాలతో చూపించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IPL 2023: సూర్య విధ్వంసం.. గుజ‌రాత్ పై ముంబై ఘ‌న విజ‌యం.. ర‌షీద్ ఖాన్ మెరుపులు వృధా

ఇక మ్యాచ్ అనంత‌రం స‌చిన్ ఆ షాట్‌పై స్పందించాడు. ‘సూర్య‌కుమార్ యాద‌వ్ ఈ రోజు చాలా అద్భుతంగా ఆడాడు. అన్ని షాట్లు బాగున్నాయి. అయితే.. ష‌మీ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ మాత్రం చాలా ప్ర‌త్యేకం. ఈ షాట్‌ను ప్ర‌పంచంలో ఉన్న చాలా మంది క్రికెట‌ర్లు ఆడ‌లేరు.’అంటూ స‌చిన్ ట్వీట్ చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే సూర్య‌కుమార్ యాద‌వ్ శ‌త‌కం చేయ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్‌(31), విష్ణు వినోద్‌(30) లు రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయ‌గా మోహిత్ శ‌ర్మ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

కాగా.. ల‌క్ష్య ఛేద‌న‌లో గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 27 ప‌రుగుల తేడాతో ముంబై విజ‌యం సాధించింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 79 ప‌రుగులు అజేయంగా నిలిచిన జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. అయితే అత‌డి పోరాటం మాత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంది.