Wrestlers protest: సాక్షి మాలిక్ రెజ్లర్ల ఉద్యమం నుంచి తప్పుకుందా?
ఉత్తర రైల్వేలో తన ఉద్యోగ బాధ్యతల్లో చేరనుంది సాక్షి మాలిక్.

Sakshi Malik
Wrestlers protest – Sakshi Malik : రెజ్లర్ల ఉద్యమం నుంచి సాక్షి మాలిక్ తప్పుకుందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, తాను రెజ్లర్ల ఉద్యమం నుంచి తప్పుకోలేదని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది సాక్షి మాలిక్. “నేను రెజ్లర్ల ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానన్నది తప్పుడు ప్రచారమే. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమేమీ వెనక్కు తగ్గలేదు. సత్యాగ్రహంతో పాటు రైల్వేలో నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని పేర్కొంది.
తాజాగా రెజ్లర్ల నిరసనపై కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) జోక్యం చేసుకున్నారు. శనివారం రాత్రి అమిత్ షా ను రెజ్లర్లు కలిశారు. ఆయనను కలిసిన వారిలో భజరంగ్ పునియా (Bajrang Punia), సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియన్ ఉన్నారు.
చట్టం అందరికీ సమానమే అని, చట్టం తన పని తాను చేస్తుందని అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్ల నిరసన నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నట్లు కథనాలు వచ్చాయి. ఉత్తర రైల్వేలో తన ఉద్యోగ బాధ్యతల్లో చేరనుంది సాక్షి మాలిక్. అయిదు నెలలుగా రెజ్లర్ల ధర్నాకు మద్దతుగా సాక్షి మాలిక్ ఉంది. గత మంగళ వారం తన మెడల్స్ ను సైతం గంగా నదిలో కలిపేందుకు సిద్ధపడింది సాక్షి మాలిక్.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను అరెస్టు చేయనిదే తాము ఆందోళన విరమించబోమని రెజ్లర్లు చెప్పిన విషయం తెలిసిందే.
లైంగిక వేధింపులకు గురైనవారిలో మైనర్ బాలిక ఉన్నప్పటికీ పోలీసులు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నూతన పార్లమెంట్ కు మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. వారిలో సాక్షి మాలిక్ సహా వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, విజయేందర్ ఉన్నారు.
తాజాగా, భారతీయ రైల్వేలో OSDగా చేరారు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్. రెజ్లర్ల ఉద్యమం ఇక నీరుగారిపోయినట్లేనని విమర్శలు వస్తున్నాయి.