IPL 2021- వంద సార్లైనా అదే పనిచేస్తా..

IPL 2021- వంద సార్లైనా అదే పనిచేస్తా..

Ipl 2021

Sanju Samson- ఐపీఎల్ 2021లో ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. లేటెస్ట్‌గా ఢిల్లీకి, రాజస్థాన్‌కి మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి బంతివరకు సాగింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ చెలరేగి ఆడాడు. క్రిస్ మోరిస్‌ని ఈ ఏడాది వేలంలో రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) రూ .16.23 కోట్లకు కొనుగోలు చేయగా.. అతనిని కొనడం తప్పుకాదని నిరూపించాడు మోరీస్.

ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్.. చివరి రెండు బంతుల్లో ఐదు పరుగులు అవసరమైనప్పుడు, కెప్టెన్ సంజు శాంసన్.. క్రిస్ మోరీస్‌పై విశ్వాసం ఉంచలేదు. చివరిబంతిని ఆడటానికి అతనికి స్ట్రైక్ ఇవ్వలేదు.. కానీ, గురువారం ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మత్రం.. రాజస్థాన్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన తర్వాత ఎనిమిదో స్థానంలో వచ్చిన మోరీస్.. నాలుగు సిక్సర్ల సహాయంతో 36 నాటౌట్‌గా నిలచి మ్యాచ్‌ను గెలిపించాడు.

ఈ క్రమంలో మ్యాచ్ తరువాత, మారిస్‌కు పంజాబ్‌తో మ్యాచ్‌లో స్ట్రైక్ ఇవ్వకపోవడంపై శాంసన్ పెద్ద ప్రకటన చేశాడు. పంజాబ్‌పై మోరిస్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా పొరపాటు చేసినట్లుగా వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. చివరి ఓవర్‌లో మోరీస్ మీద నమ్మకం ఉన్నా కూడా.. వంద సార్లు అటువంటి అవకాశం ఉన్నప్పుడు నేను ఆడేందుకే ప్రయత్నిస్తా.. “నేను ఎప్పుడూ కూర్చుని నా ఆటను సమీక్షించుకుంటూ ఉంటాను.., నాకు ఆ మ్యాచ్‌లో జరిగినట్లుగా 100 సార్లు జరిగినా.., నేను ఆ సింగిల్ తీయను” అని శాంసన్ అన్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ 42పరుగులకే కుప్పకూలినా.. మిల్లర్.. మోరిస్ మంచి ప్రదర్శన కనబరిచారని శాంసన్ అన్నారు.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున డేవిడ్ మిల్లెర్ 43 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. రాజస్థాన్ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 150 పరుగులు చేసి విజయం సాధించింది. అంతుకుముందు కెప్టెన్ రిషబ్ పంత్ అర్ధ సెంచరీ చెయ్యగా.. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 147 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. పంత్ 32 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. రాజస్థాన్ తరఫున జయదేవ్ ఉనద్కట్ 15 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.