క్రికెటర్ పెద్ద మనసు: మ్యాచ్ ఫీజును విరాళంగా ఇచ్చేసిన సంజూ శాంసన్

  • Published By: vamsi ,Published On : September 8, 2019 / 10:26 AM IST
క్రికెటర్ పెద్ద మనసు: మ్యాచ్ ఫీజును విరాళంగా ఇచ్చేసిన సంజూ శాంసన్

భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని మైదానంలో పనిచేసే సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. కేరళకు చెందిన సంజూ శాంసన్.. తన సొంత రాష్ట్రం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో మెరుపులు మెరిపించాడు.

48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో 91పరుగులు చేసిన సంజూ శాంసన్..  ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ తనకు ఫీజుగా వచ్చిన రూ. 1.5 లక్షలను అక్కడి స్టేడియంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించాడు.

మ్యాచ్ కు ముందు స్టేడియంలో భారీగా వర్షం పడింది. అయితే స్టేడియం సిబ్బంది ఎంతో కష్టకపడి స్టేడియంను క్లీన్ చేయగా.. ఆడేందుకు వీలైంది. ఆ కారణంగానే ఈ క్రెడిట్ అంతా వారికే చెందుతుందంటూ మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు సంజూ శాంసన్. దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక చివరి వన్డేలోనూ భారత్-ఏ విజయం సాధించి 4-1తో సిరీస్ చేజిక్కించుకుంది.

వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేను 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. సంజూతో పాటు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా-ఏ 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయ్యింది.