నెటిజన్లు ఫిదా: రక్తం కారుతున్నా లెక్కచేయకుండా.. వాట్సన్ భీకర బ్యాటింగ్

నెటిజన్లు ఫిదా: రక్తం కారుతున్నా లెక్కచేయకుండా.. వాట్సన్ భీకర బ్యాటింగ్

ఉత్కంఠభరితమైన పోరులో చెన్నైపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది కానీ, చెన్నై బ్యాట్స్‌మన్ వీరోచిత ప్రదర్శనతో మనస్సులు గెలుచుకున్నాడు. ఇది మ్యాచ్ చూసిన వాళ్ల అభిప్రాయం. కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో మరో నిజం బయటికొచ్చింది. సాటి ప్లేయర్ హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షేన్‌వాట్సన్ మోకాలికి రక్తం కారుతున్నా పోరాటాన్ని వదలలేదని తెలిపాడు. 

ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టిన భజ్జీ.. ‘మీకంతా తెలుసా అతని మోకాలిపై రక్తం మరకలు ఉన్నాయని, మ్యాచ్ ముగిసిన తర్వాత దానికి ఆరు కుట్లు వేయించుకున్నాడు. డైవింగ్ చేస్తున్నప్పుడు గాయానికి గురైయ్యాడు. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండానే బ్యాటింగ్ చేశాడు. అది షేన్‌వాట్సన్ అంటే.. ‘ అని రాసుకొచ్చాడు. మ్యాచ్ ముగిసి రెండో రోజు కావొస్తున్నా వాట్సన్ ప్రదర్శనపై ప్రశంసలు ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఫొటో వైరల్ అవడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు.  

చివరి ఓవర్‌కు ముందు చెన్నై గెలవాలంటే ఇంకా 9 పరుగులు కావాలి. షేన్‌వాట్సన్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ లసిత్ మలింగ‌కు బౌలింగ్ అప్పగించి 8పరుగులు మాత్రమే ఇవ్వాలని నిర్దేశించింది. తొలి 3బంతులు 4పరుగులు తెచ్చిపెట్టాయి. మూడో బంతికే మరో పరుగు కోసం యత్నించడంతో వాట్సన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్ వికెట్‌కు ముందు 2పరుగులు చేసి ఫైనల్ బంతికి అవుట్ అయ్యాడు.