IPL 2023: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టేది అత‌డే : ర‌విశాస్త్రి

టీమ్ఇండియా ఓపెన‌ర్, గుజరాత్ టైటాన్స్ ఆట‌గాడు శుభ్‌మ‌న్‌ గిల్ కు మాత్ర‌మే ఐపీఎల్‌లో విరాట్ సాధించిన ఓ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే స‌త్తా ఉంద‌ని టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డాడు.

IPL 2023: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టేది అత‌డే : ర‌విశాస్త్రి

IPL 2023: క్రికెట్‌లో ఓ ఆట‌గాడు నెల‌కొల్పిన రికార్డును మ‌రో ప్లేయ‌ర్ బ‌ద్ద‌లు కొట్ట‌డం స‌హ‌జం. అయితే.. కొన్ని రికార్డులు మాత్రం చెక్కుచెద‌ర‌కుండా ఉంటాయి. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో స్టార్ ఆట‌గాడు అయిన విరాట్ కోహ్లి(Virat Kohli) పేరిట ఉన్న ఓ రికార్డు గురించి.. కొత్త సీజ‌న్ ప్రారంభ‌మైన ప్ర‌తీ సారి చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. అదే ఓ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడు. 2016లో విరాట్ కోహ్లి (973 ప‌రుగులు) ఈ రికార్డు నెల‌కొల్పాడు.

విరాట్ ఈ రికార్డు సాధించి 6 సీజ‌న్లు పూర్తి అయ్యాయి. ఏడో సీజ‌న్ న‌డుస్తోంది. డేవిడ్ వార్న‌ర్‌, జోస్ బ‌ట్ల‌ర్ వంటి ఆట‌గాళ్లు ఈ రికార్డును బ‌ద్ద‌లు కొడుతార‌ని బావించిన‌ప్ప‌టికీ వారి వ‌ల్ల కాలేదు. అస‌లు ఈ రికార్డును బ్రేక్ చేసే ఆట‌గాడు ఎవ‌రు అంటూ చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై భార‌త మాజీ జ‌ట్టు కోచ్ ర‌విశాస్త్రి(Ravi Shastri) స్పందించాడు. టీమ్ఇండియా ఓపెన‌ర్, గుజరాత్ టైటాన్స్ ఆట‌గాడు శుభ్‌మ‌న్‌ గిల్(Shubman Gill) కు మాత్ర‌మే ఆ స‌త్తా ఉంద‌ని శాస్త్రి అభిప్రాయ ప‌డ్డాడు.

“నా అభిప్రాయం ప్ర‌కారం గిల్‌కే ఆ అవ‌కాశం ఉంది. ఎందుకంటే అత‌డు ఓపెన‌ర్ కాబ‌ట్టి ఎక్కువ ప‌రుగులు చేసేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ప్ర‌స్తుతం అత‌డు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. ఒక టోర్నీలో 900 పైచిలుకు ప‌రుగులు చేయ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. అలా చేయాలంటే లీగ్ మ్యాచుల‌తో పాటు క‌నీసం అద‌నంగా మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడాలి. ప్ర‌స్తుతం పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. గిల్ నిల‌క‌డ‌గా 80 పైన ప‌రుగులు చేయ‌గ‌లిగితే ఆ రికార్డును అందుకునే అవ‌కాశం ఉంది.” అని ర‌విశాస్త్రి అన్నాడు.

2016 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి 81.08 స‌గ‌టుతో 152 స్ట్రైక్‌రేట్‌తో 973 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు, ఏడు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. విరాట్ త‌రువాత ఓ సీజ‌న్‌లో అత్య‌ధికంగా ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో బట్ల‌ర్‌(863), వార్న‌ర్‌(848) లు ఉన్నారు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 77 మ్యాచ్‌లు ఆడిన గిల్ 32.52 సగటుతో 126.24 స్ట్రైక్ రేట్‌తో 2,016 పరుగులు చేశాడు. గ‌త సీజ‌న్‌లో గుజరాత్ టైటాన్స్ త‌రుపున 16 ఇన్నింగ్స్‌లలో 483 పరుగులు చేసి గుజ‌రాత్ టైటిల్ అందుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.