సిక్కి రెడ్డికి కరోనా పాజిటివ్

  • Published By: vamsi ,Published On : August 14, 2020 / 08:17 AM IST
సిక్కి రెడ్డికి కరోనా పాజిటివ్

బెంగళూరులోని హాకీ జట్టులోని 6 మంది ఆటగాళ్ళకు కరోనా సోకగా.., ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆటగాళ్ళకు కూడా కరోనా సోకడం కలవరపెడుతుంది. మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్ కరోనా బారినపడ్డారు. దీంతో శానిటైజేషన్ కోసం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసివేశారు. జాతీయ బ్యాడ్మింటన్ శిబిరంలో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్న ఎన్.సిక్కి రెడ్డికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

దాదాపు 5 నెలల తర్వాత శిక్షణ శిబిరం తెరుచుకోగా, అంతలోనే మూతపడడంతో ఆటగాళ్లు నిరుత్సాహపడుతున్నారు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిబంధనల ప్రకారం శిబిరంలో పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది కచ్చితంగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవలసి ఉండగా.. వారు పరీక్షలు చేయించుకున్నారు. పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ శిబిరం జరుగుతోంది.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) ఒక పత్రికా ప్రకటన ప్రకారం, ‘సిక్కి మరియు కిరణ్ ఇద్దరికీ కరోనా సంకేతాలు లేవు. ఇద్దరూ హైదరాబాదుకు చెందినవారు మరియు వారి ఇంటి నుండి శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మొత్తం 20 మందికి పరీక్షలు నిర్వహించారు. పీవీ సింధు, ఆమె తండ్రి పీవీ రమణ, కోచ్‌ గోపీచంద్, సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ సహా 18 మందికి నెగటివ్ ఫలితాలు రాగా, సిక్కిరెడ్డి, ఫిజియో కిరణ్‌లకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.