RCB vs SRH, Eliminator 1: కీలక పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్.. సాహా దూరం.. గోస్వామి వచ్చాడు

  • Published By: vamsi ,Published On : November 6, 2020 / 07:23 PM IST
RCB vs SRH, Eliminator 1: కీలక పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్.. సాహా దూరం.. గోస్వామి వచ్చాడు

RCB vs SRH, Eliminator 1, IPL 2020: ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్‌లో రెండవ పోరు ఇవాళ(06 నవంబర్ 2020) అబుదాబి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడుతున్నాయి.



ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని, బెంగళూరు జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ పోరులో గెలిస్తేనే క్వాలిఫైయర్-2కు వెళ్తారు. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి బాటపడతారు. ఇంతటి కీలక మ్యాచ్‌లో గెలివాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.



టోర్నీలో మొదట ఇబ్బందులు పడిన హైదరాబాద్ టీమ్.. లీగ్ దశలో తన చివరి మూడు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అదే ఊపుతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫైయర్‌-2కు వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు టోర్నీలో ఆరంభంలో అదరగొట్టిన కొహ్లీ సేన లీగ్ ఆఖరులో ఇబ్బందులు పడింది. తన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది.



చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ చేతిలో వరుసగా ఓడిపోతూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ ఇప్పుడు గెలుస్తుందా? అనేది చూడాలి. కీలకమైన ఈ మ్యాచ్‌లో జట్టుకు సాహా దూరం కాగా.. గోస్వామికి చోటు దక్కింది. ఇక బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో ఫిలిప్పీ బదులుగా ఫించ్ తిరిగి రాగా, మోయిన్ అలీ కూడా ఆడుతున్నారు. ఆడమ్ జంపాను తీసుకుని ఇసురు ఉడానాను బయటకు పంపారు.



ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 8 సార్లు గెలిచింది. మరో 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సెప్టెంబరు 21న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. అక్టోబరు 31న షార్జా వేదికగా మ్యాచ్‌లో ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించింది ఎస్‌ఆర్‌హెచ్.



Sunrisers Hyderabad (Playing XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శ్రీవాట్స్ గోస్వామి (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ప్రియంగార్గ్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి.నటరాజన్.



Royal Challengers Bangalore (Playing XI): దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్ విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, శివం దుబే, నవదీప్ సైని, ఆడమ్ జాంపా, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.