ఉప్పల్ సింగం ఎవరు : రాయల్స్‌తో హైదరాబాద్ ఢీ

ఉప్పల్ సింగం ఎవరు : రాయల్స్‌తో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2019లో భాగంగా 8వ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు సర్వం సిద్దమైంది. ఈ పోటీలో ఇరు జట్లు ఓటమి తర్వాత తలపడుతున్న మ్యాచ్ ఇది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో స్టేడియంను సిద్ధం చేశామని సీపీ భగవత్ తెలిపారు. 

లీగ్‌లో తొలి విజయం కోసం తహతహలాడుతోన్న జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోగా.. రాజస్థాన్ రాయల్స్‌పై అంతకుముందు మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను రన్ అవుట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు ఖాయంగా అనిపిస్తోంది. కేన్ విలియమ్సన్ ఫిట్ నెస్ సాధించి బరిలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. గతేడాది జరిగిన సీజన్ లో సన్‌రైజర్స్ జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లిన కేన్ విలియమ్సన్ జట్టులోకి వస్తే  వార్నర్ తోడుగా మెరుపులతో కూడిన షాట్‌లు సంధించడం ఖాయం. 

భారీ భద్రత:
ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు భారీ భద్రతలు తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌  తెలిపారు. సీజన్ మొత్తంలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 29వరకూ ఉప్పల్ స్టేడియం 7మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ సందర్భంగా 2,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాచకొండ ట్రాఫిక్‌ సిబ్బంది, ఆరు ప్లటూన్ల ఆర్మ్‌డ్‌ ఫోర్స్, ఆక్టోపస్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు సీసీఎస్‌ స్టాఫ్‌తో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 300 సీసీ కెమెరాలతో స్టేడియం ఆవరణమంతా పర్యవేక్షించనున్నారు. 

అనుమతించేదే లేదు: 
ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోనికి అగ్గిపెట్టెలు, బైనాక్యూలర్స్, బ్యానర్లు, సిగరెట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్‌ బాటిల్స్, పెన్నులు, సెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కెమెరాలు, సెల్‌ఫోన్‌ రీచార్జి బ్యాటరీలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. కేవలం సెల్ ఫోన్‌తో వాటి ఇయర్‌ఫోన్స్‌ను మాత్రమే అనుమతించనున్నారు.