పాక్-కివీస్ టీ20 మ్యాచ్ ఆపేసిన సూర్యుడు.. వీడియో వైరల్

పాక్-కివీస్ టీ20 మ్యాచ్ ఆపేసిన సూర్యుడు.. వీడియో వైరల్

Sun stops play New Zealand vs Pakistan T20I : క్రికెట్ మ్యాచ్‌లను వరుణుడు ఆపడం కామన్.. మ్యాచ్ ఆడే సమయంలో సడన్ ఎంట్రీ ఇవ్వడం వరుణుడికే చెల్లుతుంది. వరుణుడు మాత్రమే మ్యాచ్ లకు అడ్డంకిగా నిలవడం చూశాం.. కానీ, ఈసారి ఆ డ్యూటీని సూర్యుడు తీసుకున్నాడు. ఎప్పుడూ వరుణుడేనా.. ఈసారి తన వంతు అన్నట్టుగా సూర్యుడు వచ్చేశాడు..  వరుణుడు.. సూర్యుడు ఇద్దరూ తమ షిప్ట్‌లు మార్చుకున్నారంట.. మెక్ లీన్ పార్క్ గ్రౌండ్ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ సమయంలో ఈ అరుదైన ఘటన జరిగింది.

మూడో టీ20 మ్యాచ్‌కు ఉన్నట్టుండి సూర్యుడు అడ్డుపడ్డాడు.. ఆటను మధ్యలోనే ఆపేశాడు. అసలేం జరిగిందంటే?.. పాక్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. అదే సమయంలో సూర్యుడు వచ్చి బ్యాట్స్ మెన్లకు అడ్డంగా నిలబడ్డాడు. సూర్యకాంతి నేరుగా కళ్లపై పడటంతో ఆటగాళ్లకు బంతిని చూడటం కష్టంగా మారింది. దాంతో సూర్యుడు షిప్ట్ మారేంతవరకు ఆట ఆపేశారు.


సూర్యుడు డ్యూటీ దిగిన తర్వాత మళ్లీ మ్యాచ్ కొనసాగింది. ఇలాంటి ఘటనే 2019లో జనవరిలో ఇదే మైదానంలో జరిగింది. అప్పుడు వన్డే మ్యాచ్ జరుగుతోంది. వన్డేలో న్యూజిలాండ్ టీమిండియాతో మ్యాచ్ జరిగింది. అదే సమయంలో సూర్యుడు అడ్డంకిగా నిలిచి మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. ఇప్పుడు పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ కు మళ్లీ సూర్యుడు అడ్డు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ గ్రౌండుల్లో పిచ్‌లు అనేవి ఎక్కువగా ఉత్తరం-దక్షిణం డైరెక్షన్లలోనే ఉంటాయి. కానీ, మెక్ లీన్ పార్క్ మైదానంలో పిచ్ మాత్రం అలా లేదు. ఇక్కడి పిచ్ తూర్పు-పశ్చిమ డైరెక్షన్ లో ఉంది. అందుకే సూర్యకాంతి నేరుగా బ్యాట్స్ మెన్ కళ్లలోకి పడుతుంది. బౌలర్ బంతి వేసినప్పుడు దాని వేగాన్ని గుర్తించడం కష్టంగా మారింది. దాంతో బ్యాట్స్ మెన్ మేం ఆడలేమన్నారు. సూర్యుడు వెళ్లేవరకు ఇన్నింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే మళ్లీ మొదలెట్టారు.

చివరికి న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. కివీస్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 2 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో (177/6)తో విజయం సాధించింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 89 పరుగులతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.