27ఏళ్ల తర్వాత రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం!

  • Published By: sreehari ,Published On : February 18, 2020 / 06:55 PM IST
27ఏళ్ల తర్వాత రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం!

ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో భారత్ పసిడితో మెరిసింది. 27ఏళ్ల తర్వాత రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో తొలిసారి బంగారు పతకాన్ని భారత్ ముద్దాడింది. ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సీనియర్ ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్‌ ఫైనల్లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ 87కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. అజాత్ కిర్గిజాస్థాన్ కు చెందిన అజత్ సాలిడినోవ్ తో జరిగిన 87 కిలోల ఫైనల్ పోటీలో 5-0 తేడాతో సునీల్ పసిడి పతకాన్ని సాధించాడు.   

2019లో సునీల్ సొంతంగా రజతం సాధించిన ప్రదర్శనపై ఇది మెరుగైన ప్రదర్శన మాత్రమే కాదు.. 27 సంవత్సరాల తరువాత భారతదేశానికి మొట్టమొదటి గ్రీకో-రోమన్ స్వర్ణం కూడా దక్కేలా చేశాడు. చివరిసారిగా 1993లో పప్పు యాదవ్ 48 కిలోల టైటిల్ గెలుచుకున్నాడు. బంగారు పతకాన్ని గెల్చుకున్న అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగానూ గర్వంగానూ ఉంది.

సొంత మెరుగైన ప్రదర్శనతో రజత పతకం నుంచి స్వర్ణానికి పతకం రంగు మారింది. గత ఏడాది నుంచి రెజ్లింగ్ టెక్నిక్స్ విషయంలో చాలా లోతుగా శ్రమించాను. డెఫెన్స్ చేయడంలో మెరుగుపడ్డాను. ఇప్పుడు అదే నాకు సాయమైంది’ అని సునీల్ సంతోషం వ్యక్తం చేశాడు. జాతీయ కోచ్ హర్గోబైండ్ సింగ్.. ఈ విజయం గ్రీకో-రోమన్ పై ఎక్కువ దృష్టి పెట్టడానికి సాయపడిందని భావిస్తున్నట్టు తెలిపారు. 

55 కిలోల కేటగిరీలో  21 ఏళ్ల అర్జున్ హలకుర్కి 7-4 తేడాతో కొరియాకు చెందిన డాంగ్ హ్యోక్ వోన్‌పై కాంస్యం సాధించాడు. 2018 జూనియర్ ప్రపంచ ఛాంపియన్, స్వర్ణ పతక విజేత ఇరాన్‌కు చెందిన పౌయా మొహమ్మద్ నాసర్‌పూర్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 7-1తో ఆధిక్యంలో ఉన్న హలకుర్కి తన దూకుడుతో చివరి కొన్ని సెకన్లలో 7-8తో మాత్రమే నిష్ర్కమించి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

ఇతర పతక పోటీదారు మెహర్ సింగ్ 130 కిలోల కాంస్య పతకం ప్లేఆఫ్‌లో కిర్గిజ్స్తాన్ రోమన్ కిమ్‌ చేతిలో 2-3 తేడాతో ఓడిపోయాడు. డే వన్ పోటీలో ఉన్న మరో ఇద్దరు భారతీయులు, సజన్ భన్వాల్, సచిన్ రానా లీగ్ దశలను అధిగమించడంలో విఫలమయ్యారు.