కంగారూలను పరుగులు పెట్టించిన టీమిండియా, ఆసీస్ టార్గెట్ 191

కంగారూలను పరుగులు పెట్టించిన టీమిండియా, ఆసీస్ టార్గెట్ 191

తొలి టీ20 పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కొనసాగించింది. టైగా ముగించాలనే తపనతో బ్యాట్స్‌మెన్ తడాఖా చూపించారు. ఆస్ట్రేలియాకు 191 పరుగుల టార్గెట్ నిర్ధేశించారు. 

రాహుల్‌కు బాగా కలిసొచ్చిన టీ20 ఫార్మాట్‌లో దూసుకుపోయాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(47; 26 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సులు), ధావన్(14) శుభారంభాన్ని ఇచ్చారు. 7.1 ఓవర్ల వద్ద రాహుల్ అవుటవడంతో విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. ఆ కాసేపటికే ధావన్ 9.2ఓవర్ల వద్ద అవుటవడంతో రిషబ్ పంత్(1) వచ్చి కేవలం ఒక్క పరుగుతో సరిపెట్టుకున్నాడు. 

ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజానికేసుకున్న కోహ్లీ(72), ఎంఎస్ ధోనీతో కలిసి రెచ్చిపోయాడు. 29 బంతుల్లోనే వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీకి చక్కని భాగస్వామ్యం అందించిన ధోనీ (40; 23బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు ) క్రితం మ్యాచ్‌లా కాకుండా దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరిగా బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్(8) 3 బంతుల్లో 2 ఫోర్లు బాదాడు.