Tokyo Olympics 2020: దేశానికే తొలి గోల్డ్ మెడల్.. సాధించిన డఫీ

దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. 1936 నుంచి తమ దేశం నుంచి క్రీడాకారులను పంపిస్తూనే ఉన్న బెర్ముడాను తొలిసారి స్వర్ణం వరించింది. ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పర్యవేక్షణలోని అతి చిన్నదైన దేశం కూడా గోల్డ్ గెలిచిన జాబితాల్లో చేరిపోయింది.

Tokyo Olympics 2020: దేశానికే తొలి గోల్డ్ మెడల్.. సాధించిన డఫీ

Flora Dfuffy

Tokyo Olympics 2020: దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. 1936 నుంచి తమ దేశం నుంచి క్రీడాకారులను పంపిస్తూనే ఉన్న బెర్ముడాను తొలిసారి స్వర్ణం వరించింది. ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పర్యవేక్షణలోని అతి చిన్నదైన దేశం కూడా గోల్డ్ గెలిచిన జాబితాల్లో చేరిపోయింది. సుమారు 64 వేల మంది ఉన్న బెర్ముడా దేశ జనాభాలో 33 ఏళ్ల ట్రయాథ్లెట్‌ ఫ్లోరా డఫీ బంగారపు కలను సాకారం చేసింది.

టోక్యోలో ఆ దేశం తరఫున డఫీతోపాటు అలీజదె దారా (రోయింగ్‌) మాత్రమే బరిలోకి దిగారు. ఆ దేశం ఖాతాలో ఇంతకుముందు వరకూ ఒకే ఒక కాంస్యం ఉంది. దాదాపు 45ఏళ్ల క్రితం అంటే 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో ఆడిన క్లారెన్స్‌ హిల్‌ పురుషుల బాక్సింగ్‌ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించాడు.

ఇన్నేళ్లకు ట్రయాథ్లాన్‌ను గంటా 55 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసిన డఫీ మొదటి స్థానంలో నిలిచింది. 1500 మీటర్ల స్విమ్మింగ్‌… 40 కిలోమీటర్ల సైక్లింగ్‌… 10 కిలోమీటర్ల పరుగు… ఈ మూడూ ఒలింపిక్‌ ట్రయాథ్లాన్‌లో భాగం. ఒకటి తర్వాత మరొకటి వరుసగా పూర్తి చేయాల్సిన కఠినమైన ఈవెంట్‌ ఇది. ఎంతో ఫిట్‌నెస్, పట్టుదల ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న ఈ మె రేస్‌ కూడా పూర్తి చేయలేకపోయారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రేసు పూర్తి చేసినా.. 45వ స్థానంలో నిలిచింది. దాంతోపాటు కెరీర్‌లో వరుస గాయాలు. ఒకదాని వెంట మరొకటి దాదాపు పది సార్లు భిన్నమైన గాయాలతో పోరాడింది. ఎనీమియా కూడా ఆమె పాలిట శాపంలా మారింది. విసుగెత్తి ఏడాది పాటు ఆటకు గుడ్‌బై చెప్పేసి చదువుపై దృష్టి పెట్టింది.

డిగ్రీ పూర్తి చేసి మళ్లీ క్రీడల వైపు పరుగుపెట్టింది. పునరాగమనంలో 2016 రియో ఒలింపిక్స్‌లో ఈసారి 8వ స్థానం. వరల్డ్‌ ట్రయాథ్లాన్‌ సిరీస్‌లలో గెలుస్తున్నా… లక్ష్యం మాత్రం ఒలింపిక్‌ గోల్డ్ మెడల్ సాధించడమే.
దాని కోసం కఠినంగా శ్రమించిన డఫీ.. సగర్వంగా విజేతగా నిలిచింది. స్వర్ణం గెలిచిన వారి దేశపు జాతీయ గీతం వినిపించే ఆనవాయితీగా బెర్ముడా నేషనల్ సాంగ్ వినిపిస్తుంటే చెమర్చిన కళ్లతో సంతోషంలో మునిగిపోయారు.