ఫ్యామిలీనే ముఖ్యం: క్రికెట్టే జీవితం కాదంటున్న కెప్టెన్ కోహ్లీ

10TV Telugu News

పరుగుల యంత్రం.. ఆటపై అంకిత భావం.. మైదానంలో దూకుడైన స్వభావం ఈ లక్షణాల జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ముందుంటాడు. లక్ష్య చేధనలో రారాజుగా కొనసాగుతున్న కోహ్లీ.. తన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దిగ్గజాలు సైతం అతనికి క్రికెట్ కంటే మరేది ఎక్కువ కాదని ప్రశంసిస్తున్న తరుణంలో కెప్టెన్ వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయి. జీవితంలో క్రికెట్‌ కేవలం ఓ భాగం మాత్రమే అని, కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని కోహ్లి అంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే విరాట్ తన పేరుపై ఉన్న మొబైల్ యాప్‌లో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 

‘ఎనిమిదేళ్ల తర్వాత ఏం చేస్తారు అని నన్ను అడిగితే? కుటుంబానికి ప్రాధాన్యతనిస్తానని చెప్తా. నేను, నా భార్య అనుష్క, మా కుటుంబం అంతే. జీవితంలో ఏం జరిగినా.. జరగాల్సి ఉన్నా కూడా తిరిగి నువ్వు ఇంటికి రావాల్సిందే. కాబట్టి నా ప్రాధాన్యం తప్పకుండా కుటుంబమే. క్రికెట్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. కానీ అదే జీవితం కాదు. ఎందుకంటే జీవితంలో కుటుంబానికి మించి ఏముంది? కొంతమంది ఆ విషయాన్ని వదిలేసి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. అది సరికాదు. క్రికెట్ ఆడగలగడం అదృష్టం. కానీ ఏదో ఒక రోజు ముగింపు చెప్పాల్సిందే. అలా ముగింపునిచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా కుటుంబానికే ప్రాధాన్యమిస్తా’ అని కోహ్లి తన యాప్ ద్వారా వెల్లడించాడు. 

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక అంతర్జాతీయ సెంచరీలలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను దాటి మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లి కంటే ముందు పాంటింగ్‌, సచిన్‌ మాత్రమే ఉన్నారు. ఇప్పటికే 64 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన కోహ్లీ.. సచిన్ సెంచరీల రికార్డును అధిగమించే దిశగా దూసుకెళ్తున్నాడు. 

×