‘విరాట్.. రోహిత్ శర్మ నుంచి నేర్చుకోవాలి’

‘విరాట్.. రోహిత్ శర్మ నుంచి నేర్చుకోవాలి’

-Rohit-Sharma

Virat Kohli – Rohit Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారీ సూచనలు ఇస్తున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. ఈ విషయంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నుంచి విరాట్ సూచనలు తీసుకోవాలని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో విరాట్ డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

బెన్ స్టోక్స్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. కీపర్ చేతికి చిక్కి నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో విరాట్ తన మార్క్ పర్‌ఫార్మెన్స్ కనబరచలేకపోయాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 11, 72, 0, 62, 27, 0లతో విఫలమయ్యాడు. హాఫ్ సెంచరీలను సెంచరీలుగా కూడా మార్చుకోలేకపోయాడు. ఇలా విరాట్ బ్యాటింగ్‌పై అనిశ్చితి నెలకొంది.

భారత్-ఇంగ్లండ్ సిరీస్ చాలా టఫ్ గా మారిందని మనోజ్ తివారీ అంటున్నాడు. ఇటీవల మాట్లాడుతూ.. ‘కఠిన పరిస్థితుల్లో భారీ స్కోర్లు చేయడం బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. చాలా కఠిన పరిస్థితుల మధ్య భారత్-ఇంగ్లండ్ సిరీస్ జరుగుతుందనే వాస్తవాన్ని గ్రహించాలి. చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ తొలి రెండు రోజులు మినహాయిస్తే బంతి టర్న్ అవుతూనే ఉంది. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పరిస్థితుల కారణంగానే స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో చిన్న స్కోర్లను పెద్దవిగా మలచడం సులువైన విషయం కాదు. చాలెంజింగ్ పరిస్థితుల్లో 50 పరుగులు చేసిన తర్వాత కూడా బ్యాట్స్‌మెన్ సెట్ కాడు.

శుక్రవారం మ్యాచ్‌లో విరాట్ ఆ బంతి ఆడాల్సింది కాదు. టాపార్డర్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవారు సెటిల్ అయ్యేవరకు వీలైనంత వరకు బంతులు వదిలేయాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. బంతులు వదిలేయడం కూడా ఓ టాలెంట్. రోహిత్ శర్మ చాలా టాలెంటెడ్ గా బంతులు వదిలేశాడు. ఆఫ్ స్టంప్ విషయంలో నమ్మకం ఉన్నప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వదిలేయొచ్చు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అన్ని బంతులు సమర్థవంతంగా ఆడగలడని అనుకుంటాం.

స్టోక్స్ వేసిన బంతి బౌన్స్ అయింది. విరాట్ దాన్ని వదిలేసుంటే బాగుండేది. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్స్ బంతులను వదిలేసే విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ నేర్చుకోవాల’ని తివారీ చెప్పుకొచ్చాడు.