తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ విజయం

  • Published By: vamsi ,Published On : July 13, 2020 / 06:29 AM IST
తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ విజయం

కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ 117 రోజుల తరువాత సౌతాంప్టన్‌లో టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభం అయ్యింది. ఇంగ్లాండ్‌కు వెస్టిండీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించగలిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

తొలి టెస్టు చివరి రోజున గెలిచేందుకు వెస్టిండీస్‌కు 200 పరుగులు చెయ్యవలసి వచ్చింది. ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గ్రాబియల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కాని వర్షం కారణంగా, మొదటి రోజు 17.4 ఓవర్లు మాత్రమే ఆడారు. కెప్టెన్ హోల్డర్ 42 పరుగులకు 6 వికెట్లు తీసినందుకు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో 318 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై 114 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసి 200 పరుగుల లక్ష్యాన్నివెస్టిండీస్‌కు నిర్దేశించింది. వెస్టిండీస్ చాలా పేలవమైన బ్యాటింగ్‌తో ఫస్ట్‌లోనే కేవలం 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

కానీ మూడు వికెట్లు పడగొట్టిన తరువాత, బ్లాక్ వుడ్ చేజ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 73 పరుగుల కీలక భాగస్వామ్యం చేశాడు. అయితే, చేజ్ 37 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత బ్లాక్‌వుడ్ ఐదవ వికెట్‌కు డౌరిచ్‌తో 68 పరుగుల పార్ట్‌నర్‌షిప్ ఇచ్చాడు. డౌరిచ్‌ను 20 పరుగులకే అవుట్ చేసి ఇంగ్లండ్‌ను ఘాడిలో పెట్టేందుకు స్టోక్స్ ప్రయత్నించాడు.

అయితే, వెస్టిండీస్ జట్టు విజయానికి 11 పరుగులు మాత్రమే చేయగా, బ్లాక్ వుడ్ 95 పరుగులకు అవుట్ అయ్యాడు. బ్లాక్‌వుడ్ మరో 5 పరుగులు చేయగలిగితే, అది అతని టెస్ట్ కెరీర్‌లో రెండవ సెంచరీ అయ్యేది. అయితే, కెప్టెన్ టేలర్ 14 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి వెస్టిండీస్‌కు విజయాన్ని అందించాడు.

చివరి రోజు మ్యాచ్‌ను తమ కోర్టులోకి తీసుకురావడానికి ఇంగ్లాండ్ బౌలర్లు తమ వంతు ప్రయత్నం చేశారు. ఇంగ్లాండ్ తరఫున ఆర్చర్ మూడు, స్టోక్స్ రెండు, వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనున్నాయి.