టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్: రాహుల్‌ను తప్పించినట్లే

టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్: రాహుల్‌ను తప్పించినట్లే

వెస్టిండీస్ పర్యటన అనంతరం ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఉండటం పట్ల అనుమానం వ్యక్తం చేసిన గంగూలీ మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే మాటల్లో రోహిత్ శర్మను ఓపెనర్‌గా దించుతానని అనడం పట్ల రాహుల్ స్థానం అనుమానంగా కనిపిస్తోంది. 4ఇన్నింగ్స్‌లు కలిపి రాహుల్ కేవలం 101పరుగులు మాత్రమే చేయగలిగాడు.  దీంతో రాహుల్‌కు బదులు రోహిత్ శర్మను ఓపెనర్‌గా తీసుకుంటామనే విధంగా మాట్లాడుతున్నారు సెలక్టర్ ప్రసాద్. 

‘వెస్టిండీస్ పర్యటన తర్వాత కమిటీ సమావేశం కాలేదు. రోహిత్ శర్మను ఓపెనర్‌గా కచ్చితంగా తీసుకుంటాం. దానికంటే ముందు అంతా కలిసి ఓ సారి చర్చిస్తాం. కేఎల్ రాహుల్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ, టెస్టు క్రికెట్ లో గడ్డు కాలం నడుస్తోంది. అతను తన ఫామ్ తిరిగి తెచ్చుకోవాల్సి ఉంది. మైదానంలో ఇంకా ప్రాక్టీస్ చేసి ఫామ్ పుంజుకుంటాడని ఆశిస్తున్నాం’ అని వెల్లడించాడు. 

ఇటీవల టీమిండియా వెస్టిండీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో భాగంగా కరేబియన్ ప్లేయర్లకు ముచ్చెమటలు పట్టించింది భారత్. పూర్తి ఆధిపత్యంతో పర్యటనను ముగించుకున్న భారత్.. మిడిలార్డర్‌లో బాగా రాణించడంతో పాటు బౌలర్లు విజృంభించడంతో కోహ్లీసేన ఏకచత్రాధిపత్యం సాధించింది.