స్మృతి మంధాన టోర్నీ నుంచి ఇంటికే..

స్మృతి మంధాన టోర్నీ నుంచి ఇంటికే..

మహిళల ఐపీఎల్‌కు ట్రయల్ టోర్నీగా నిర్వహిస్తున్న ఉమెన్ టీ20 చాలెంజ్ ఫైనల్‌కు వచ్చేసింది. మూడు మ్యాచ్‌లలో భాగంగా మొదలైన టోర్నీలో 2మ్యాచ్‌లు ముగియడంతో మిథాలీ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. జైపూర్ వేదికగా గురువారం రాత్రి వెలాసిటీ వర్సెస్ సూపర్ నోవాస్ మ్యాచ్‌లో మిథాలీ సేన 12 పరుగుల తేడాతో గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు చేతిలో ఓడిపోయింది. 

దీంతో హర్మన్ జట్టు ఫైనల్‌కి చేరుకుంది. ఇక మిగిలిన ఒక స్థానం కోసం సూపర్ నోవాస్, ట్రయల్‌బ్లేజర్స్‌ జట్లు చెరొక విజయంతో పోటీపడ్డాయి. నెట్‌ రన్‌రేట్ అధికంగా ఉన్న వెలాసిటీ జట్టుకే రెండో ఫైనల్‌ బెర్తు సొంతం చేసుకుంది. ఫలితంగా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 

గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ జట్టు 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌వుమెన్ జెమీమా రోడ్రిగ్స్ (77: 48 బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించగా.. చమరీ ఆటపట్టు (31: 38 బంతుల్లో 5ఫోర్లు) ఆమెకి చక్కటి సహకారం అందించింది. 

143 పరుగుల ఛేదనలో వెలాసిటీ టీమ్‌కి డేనియలీ వ్యాట్ (43: 33 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు) దూకుడుగా ఆడి మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిల్ ఓవర్లలో మిథాలీ రాజ్ (40 నాటౌట్: 42 బంతుల్లో 3ఫోర్లు), వేద (30 నాటౌట్: 29 బంతుల్లో 3ఫోర్లు) వేగంగా ఆడలేకపోయారు. వెలాసిటీ టీమ్ ఆఖరికి 130/3కే పరిమితమైంది. 

టోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్‌ను జైపూర్ వేదికగా శనివారం రాత్రి 7.30 గంటలకి సూపర్ నోవాస్, వెలాసిటీలు ఆడనున్నాయి.