46ఏళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు..

46ఏళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు..

ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అధ్భుతంగా రాణించిన భారత జట్టు.. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా అత్యంత చెత్త రికార్టుని తన ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు ఈ ఇన్నింగ్స్‌లోనే నమోదైంది. ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం చెందారు.

రెండో ఇన్నింగ్స్‌ను 36 పరుగలకే ఆలౌట్ అవ్వగా.. ఇప్పటివరకు టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. అంతకుయుందు 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 42 స్కోరు అత్యంత తక్కువ స్కోరు రికార్డుగా నమోదై ఉంది.

మహ్మద్‌ షమీ గాయంతో ‘రిటైర్డ్‌ అవుట్’‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు.. 36 పరుగుల వద్ద 9 వికెట్లతో ఇన్నింగ్స్‌ ముగించింది. దీంతో టీమిండియా అత్యంత తక్కువస్కోరు నమోదు చేసిన చెత్త రికార్డును క్రియేట్ చేసింది.

భారత జట్టు బ్యాట్స్‌మన్ ఎవరూ కూడా రెండంకెల మార్కును దాటలేదు. మయాంక్ అగర్వాల్ అత్యధికంగా 9 పరుగులు సాధించగా, విహారీ 8 పరుగులు చేశాడు. పూజారా, రహానె, అశ్విన్ డకౌట్‌లు అయ్యారు. కోహ్లీ, సాహా, ఉమేష్ తలా నాలుగు పరుగులు చేయాగా.. భూమ్రా రెండు పరుగులు చేశాడు. షమి ఒక్క పరుగు చేసి రిటైర్ హర్ట్‌గా పెవీలియన్ చేరుకున్నాడు.

హాజిల్‌వుడ్ ఆస్ట్రేలియా నుంచి కేవలం 8 పరుగులకు 5 వికెట్లు తీయగా, కమ్మిన్స్ 21 పరుగులకు నాలుగు వికెట్లు తీయగలిగాడు. 46ఏళ్ల తర్వాత టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు నమోదు అయ్యింది. భారత్ ఖాతాలో అంతుకుముందు.. 1947లో ఆస్ట్రేలియాపై భారత్ 58 పరుగులు చేసింది. 1952లో, మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 58 పరుగులు మాత్రమే చేసింది. 1955లో ఆక్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై 26 పరుగులు మాత్రమే చేసిన చెత్త రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది.