WPL Final 2023 : తొలి WPL టైటిల్ విజేత ముంబై ఇండియన్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ముంబై అమ్మాయిలు అదరగొట్టారు.

WPL Final 2023 : తొలి WPL టైటిల్ విజేత ముంబై ఇండియన్స్

WPL Final 2023 : భారత్ లో తొలిసారి నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ముంబై జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ముంబై అమ్మాయిలు అదరగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేశారు. 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించింది ముంబై.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. ముంబై జట్టు 19.3ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి టార్గెట్ చేజ్ చేసింది. మరో 3 బంతులు మిగిలి ఉండగానే.. 134 పరుగులు చేసి విక్టరీ కొట్టింది. ముంబై జట్టులో నాట్ సీవర్ బ్రంట్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 55 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది. మరో ఎండ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 37 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో ముంబై జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.(WPL Final 2023)

Also Read..Issy Wong : వారెవ్వా వాంగ్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు, రికార్డ్ సృష్టించిన ముంబై బౌలర్

లక్ష్య ఛేదనలో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబైని.. నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ జోడీ ఆదుకుంది. హర్మన్ ప్రీత్ ఔటైనా.. అమీలియా కెర్ (14 నాటౌట్) సహకారంతో బ్రంట్ మిగతా పని పూర్తి చేసింది. బ్రంట్‌, కౌర్ జోడీ ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

ఢిల్లీ బౌలర్లు పటిష్ఠంగా బౌలింగ్‌ చేసి పరుగులు కట్టడి చేసినప్పటికీ.. సకాలంలో వికెట్లు పడగొట్టలేకపోవడంతో ముంబై జట్టు విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్‌, జొనాసెన్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది.

ఢిల్లీ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35.. 29 బంతుల్లో 5×4), శిఖా పాండే (27 నాటౌట్.. 17 బంతుల్లో 3×4,1×6), రాధా యాదవ్‌ (27 నాటౌట్‌.. 12 బంతుల్లో 2×4,2×6) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ఒకానొక దశలో ఢిల్లీ స్కోరు 100 పరుగులైనా దాటుతుందా? అనిపించింది. కానీ, చివర్లో వచ్చిన షిఖా పాండే, రాధా యాదవ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్‌, హెయిలీ మాథ్యూస్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. అమీలియా కెర్‌ 2 వికెట్లు తీసింది.

Also Read..Saweety Boora : మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్..
ఢిల్లీ క్యాపిటల్స్ ను ముంబై సంచలన పేసర్ ఇస్సీ వాంగ్ హడలెత్తించింది. మొన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీసిన ఇస్సీ వాంగ్.. ఫైనల్ మ్యాచ్ లోనూ చెలరేగింది. వాంగ్ దెబ్బకు.. ఢిల్లీ విలవిలలాడింది. తొలి స్పెల్ లో నిప్పులు చెరిగే బౌలింగ్ తో 3 వికెట్లు తీయడం విశేషం. వాంగ్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో మూడో బంతికి విధ్వంసక ఓపెనర్ షెఫాలీ వర్మ (11)ను అవుట్ చేసిన వాంగ్.. అదే ఓవర్లో ఐదో బంతికి ఆలిస్ కాప్సేని డకౌట్ చేసి ముంబై శిబిరంలో మరింత ఉత్సాహం నింపింది. ఆ తర్వాత, ఫామ్ లో ఉన్న జెమీమా రోడ్రిగ్స్ (9) ను కూడా ఔట్ చేసి ముంబయిని కోలుకోలేని దెబ్బకొట్టింది.